యూరియా కృత్రిమ కొరత సృష్టించారు

యూరియా కృత్రిమ కొరత సృష్టించారు
  • బ్లాక్​ మార్కెట్ కు ఎట్లా వెళ్తున్నదో రాష్ట్ర సర్కారు చెప్పాలి
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్
  • ఉద్యోగుల ఆందోళనకు మద్దతిస్తున్నామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ కొరతను సృష్టించిందని, కావాలనే కేంద్రాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.2,650 విలువగల యూరియా బస్తాను కేంద్రం రూ.266 సబ్సిడీతో రైతులకు అందిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ  నిర్లక్ష్యం కారణంగా రైతులు రూ. 400కి కొనాల్సి వస్తోందన్నారు. రాష్ట్రానికి కేంద్రం పంపిస్తున్న యూరియా ఎలా పక్కదారి పడుతున్నదో, బ్లాక్ మార్కెట్‌‌‌‌కు ఎలా వెళ్తున్నదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ స్టేట్  ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. 

బ్లాక్ మార్కెట్‌‌‌‌ను అరికట్టేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్  అభివృద్ధిపై బీఆర్ఎస్, కాంగ్రెస్  నేతల మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ.. వాస్తవంలో పనులు నామమాత్రమే ఉన్నాయని విమర్శించారు. హైదరాబాద్‌‌‌‌లోని ప్రధాన రహదారుల్లో కూడా వీధిలైట్లు వెలగడం లేదన్నారు. డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా వంటి కనీస సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేకపోతోందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని, జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం 

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు, టీచర్ల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని కిషన్  రెడ్డి అన్నారు. 2023లో కాంగ్రెస్ 'అభయహస్తం' మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. వచ్చే నెల 1 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ ఉద్యోగ సంఘాల పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నదని వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు , ప్రకాశ్ రెడ్డి, ఎన్​వీ సుభాష్,  తాడూరి శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు. కాగా.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ వర్ధంతి సందర్భంగా పార్టీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.