అంతర్జాతీయ హెల్త్  హబ్​గా హైదరాబాద్

అంతర్జాతీయ హెల్త్  హబ్​గా హైదరాబాద్
  • మెడికల్​ టూరిజం పాలసీ తీసుకొస్తం : కిషన్ రెడ్డి 
  • ఆయుష్మాన్​ భారత్​ గొప్ప పథకం : బండారు దత్తాత్రేయ
  • పేదలకు వైద్యం మరింత దగ్గరవ్వాలి : వివేక్​ వెంకటస్వామి

ముషీరాబాద్, వెలుగు : హైదరాబాద్ సిటీ అంతర్జాతీయ హెల్త్ హబ్​గా తయారైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్టీసీ క్రాస్​ రోడ్​లో శ్రీకర హాస్పిటల్​ 13వ బ్రాంచ్​ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి హరీశ్​రావు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్​తో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 200 బెడ్లు, అత్యాధునిక సౌకర్యాలతో ఆస్పత్రి ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున త్వరలోనే మెడికల్ టూరిజంకు సంబంధించిన పాలసీని కూడా తీసుకువస్తామని చెప్పారు.

గిరిజన ప్రాంతాల్లో ఉన్న పేదలకు వైద్య సేవలు ఎక్కువగా అందించాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే గొప్ప హెల్త్ కేర్ స్కీం అని, దీని ద్వారా అనేకమంది పేదవాళ్లు లబ్ధి పొందారని తెలిపారు. నూతన సాంకేతికను ఉపయోగించుకొని శ్రీకర అతిపెద్ద ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషకరమని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. పేదలకు వైద్యం మరింత చేరువ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్​ చైర్మన్ డాక్టర్ అఖిల్, ఎండీ డాక్టర్ రమాసరస్వతి, సీఈఓ నిఖిల, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.