చరిత్ర తెలుసుకునేందుకు మ్యూజియం సరైన వేదిక

చరిత్ర తెలుసుకునేందుకు మ్యూజియం సరైన వేదిక
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • మాజీ ఎంపీ వివేక్​తో కలిసి ఢిల్లీలో ఎగ్జిబిషన్​ విజిట్

న్యూఢిల్లీ, వెలుగు: చరిత్ర, వారసత్వ సంపద గురించి భవిష్యత్ తరాలు తెలుసుకునేందుకు మ్యూజియాలు సరైన వేదికలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మ్యూజియంలను సందర్శించడాన్ని విద్యార్థులు తమ పాఠ్య ప్రణాళికలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రముఖ టెక్స్ టైల్ రివైవలిస్ట్ లవినా బల్డోటా ఢిల్లీలో ఏర్పాటు చేసిన టెక్స్ టైల్స్ ఎగ్జిబిషన్ ను మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలిసి కిషన్​ రెడ్డి గురువారం సందర్శించారు.

అనంతరం అదే బిల్డింగ్​లో కంబోడియా ఆర్ట్ గ్యాలరీని కిషన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. పూర్వీకులు వినియోగించిన ఆయుధాలు, నాటి వస్త్ర సంపద, కళాత్మక ఆలోచనలు వంటి ఎన్నో విషయాలను ప్రయోగాత్మకంగా తెలుసుకునేందుకు మ్యూజియంలు ఉపయోగపడుతాయన్నారు. మ్యూజియాల నిర్వాహకులు టెక్నాలజీని కూడా అలవర్చుకోవాలని, త్రీడీ సాంకేతికతతో బులెటిన్ బోర్డుల ఏర్పాటు, స్క్రీన్ ను టచ్ చేయగానే ఆ వస్తువు విశిష్టత తెలిసేలా ఏర్పాట్లు చేస్తే విజిటర్లలో ఆసక్తి పెరుగుతుందన్నారు. ఢిల్లీకి వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రజలు, విద్యార్థులు.. కర్తవ్యపథ్, నేతాజీ విగ్రహం, ఇండియాగేట్, ప్రధాని సంగ్రహాలయం వంటి ప్రాంతాలకు చూడాలని కోరారు.

మోడ్రన్​ వేలో ప్రదర్శన..

దేశ వారసత్వానికి చెందిన టెక్స్ టైల్స్ ను ‘సూతృ సంతతి’ ఎగ్జిబిషన్ ద్వారా కొత్త పద్ధతిలో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు లవినా వివరించారు. సూతృ అంటే త్రెడ్, సంతతి అంటే కొనసాగించడం అని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ కోసం పెద్ద సంఖ్యలో స్టూడెంట్లు, ఫ్యాషన్ డిజైనర్లు, ఆర్టిస్ట్ లు పని చేశారన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో 100 పైగా ఇండియన్ టెక్స్ టైల్స్ ఉన్నాయన్నారు.