ఏడాది పాటు తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తాం

ఏడాది పాటు తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తాం
  • 74 ఏళ్ల తర్వాత జాతీయ జెండా ఎగురవేయబోతున్నాం
  • ఈనెల 17న పెరేడ్ గ్రౌండ్ లో కేంద్ర బలగాలతో పెరేడ్ 
  • ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహిస్తాం
  • అందరూ ముందుకు రావాలని కిషన్ రెడ్డి పిలుపు

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల17న తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులకు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇప్పటికే ఆహ్వానాలు పంపించామన్నారు. ఈనెల 17న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో కేంద్ర బలగాలతో పెరేడ్ ఉంటుందని, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తారని చెప్పారు. అదే రోజు తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను సన్మానించుకుంటామని తెలిపారు. ఈ నెల 10 నుంచే తెలంగాణ ఉద్యమ చరిత్రపై ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేయాలని మీడియా సంస్థలను కోరామన్నారు. 

 MIM పార్టీపై ఆగ్రహం
ఈనెల17వ తేదీన తెలంగాణ స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లోకి అడుగు పెట్టబోతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ స్వాతంత్ర్య కోసం పోరాడిన పోరాటయోధుల ఆత్మలు శాంతించేందుకు మొట్టమొదటిసారి విమోచన వేడుకలను నిర్వహించబోతున్నామని, ఇది వారికి నిజమైన నివాళులర్పించే కార్యక్రమం అన్నారు. విమోచన వేడుకలు రాష్ట్ర ప్రజల కోసం నిర్వహించుకునే కార్యక్రమం అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన పార్టీలను తన కబంధ హస్తాల్లో ఉంచుకుని MIM పార్టీ శాసిస్తోందని, ఈ పార్టీ నిజాం అరాచకాలను బయటకు రాకుండా కప్పిపెట్టిందన్నారు. మజ్లిస్ పార్టీకి లొంగిపోయి టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సలాం కొట్టాయన్నారు. ఇంతటి అనాగరిక చర్య ఎక్కడా, ఎప్పుడూ జరగలేదన్నారు. 

74 ఏళ్ల తర్వాత వేడుకలు
1948 సెప్టెంబర్ 17న అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణలో జాతీయ జెండా ఎగురవేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మళ్లీ 74 ఏళ్ల తర్వాత ఈ నెల17న అధికారికంగా జాతీయ జెండా ఎగురవేయబోతున్నామని స్పష్టం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీపై విమర్శలు చేయడం లేదని, వాస్తవాలు మాత్రమే చెబుతున్నానని అన్నారు. రాష్ట్రంలోని అన్ని బురుజులకు కొత్త రంగులు వేసి జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. విమోచన వేడుకలు ప్రభుత్వ కార్యక్రమం తరహాలో కాకుండా ప్రజా పండగలా జరగాలన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ తరహాలో సెప్టెంబర్ 17న కూడా అదే స్ఫూర్తితో వేడుకలను నిర్వహించాలన్నారు. ఏడాది పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

నిజాం కాలంలో ప్రజలపై భయంకరమైన దాడులు
అనాడు హైదరాబాద్ సంస్థానంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని నిజాం అమలు చేయలేదని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారతదేశంలో కలుస్తామంటూ హైదరాబాద్ సంస్థానం ప్రజలు అనేక పోరాటాలు చేశారని, ఈ పోరాటాలను అణిచివేసేందుకు ప్రజలపై భయంకరమైన దాడులు చేశారని గుర్తు చేశారు. రజాకార్ల అఘాయిత్యాలు తట్టుకోలేక చాలామంది మహిళలు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. అప్పట్లో చాలా గ్రామాల్లో స్వచ్ఛందంగా గ్రామ రక్షణ కోసం బురుజులు నిర్మించుకున్నారని తెలిపారు. కొమురం భీం, రామానంద తీర్థ, రంగాచార్య వంటి మహనీయులు నిజాంకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశారని చెప్పారు. గ్రామాలకు కనీసం ఆహార పదార్థాలు కూడా చేరనీయకుండా నిజాం నిర్బంధం విధించారని, అప్పటి పరిస్థితులను గమనించిన అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్.. హైదరాబాద్ సంస్థానం నిజాం రాజుపై ఆర్మీతో యుద్ధానికి దిగారని, ఈ పోరాటంలో వందల మంది మృత్యువాత పడ్డారని చెప్పారు. చివరకు పోరాడలేక భారత ప్రభుత్వానికి నిజాం లొంగిపోయాడని చెప్పారు.