10 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం: కిషన్ రెడ్డి

10 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం: కిషన్ రెడ్డి
  • రాష్ట్ర సర్కార్ పై కిషన్ రెడ్డి ఫైర్ 
  • కేంద్రంలో మేం జాబ్స్ ఇస్తున్నం.. రాష్ట్రంలోనే ఇస్తలేరు 
  • ఇప్పటికే 3.60 లక్షల జాబ్స్ భర్తీ చేశామని వెల్లడి 
  • జాబ్స్​ పొందినోళ్లకు అపాయింట్​మెంట్ లెటర్లు
  • కేంద్రంలో మేం జాబ్స్ ఇస్తున్నం రాష్ట్రంలోనే ఇస్తలేరని విమర్శ

సికింద్రాబాద్/నారాయణగూడ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘మేం జాబ్స్ ఇస్తున్నం. 10 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. కానీ రాష్ట్ర సర్కార్ జాబ్స్ ఇస్తలేదు. పేపర్ లీకేజీ కేసుల పేరుతో ఉద్యోగాల భర్తీని ఆలస్యం చేస్తున్నది. యువతను వేధిస్తోంది” అని ఫైర్ అయ్యారు. ‘రోజ్ గార్ మేళా’లో భాగంగా మంగళ వారం సికింద్రాబాద్ లోని స్వామి వివేకానంద ఇనిస్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందినోళ్లకు కిషన్ రెడ్డి అపాయింట్ మెంట్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘10 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే లక్ష్యంగా ప్రధాని మోడీ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే 3లక్షల 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇందులో భాగంగా ప్రతినెల ‘రోజ్ గార్ మేళా’ నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందినోళ్లకు అపాయింట్ మెంట్ లెటర్లు అందజేస్తున్నారు” అని తెలిపారు.

వచ్చే 25 ఏండ్లు కీలకం... 

వచ్చే 25 ఏండ్లు మనకెంతో కీలకమని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘వివిధ పరిస్థితుల వల్ల దేశం ఇప్పటి వరకు ముందుకు వెళ్లలేదు. ఇప్పుడిప్పుడే అన్ని సౌలతులు కల్పించుకుంటున్నం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. అత్యధిక యువత కలిగిన దేశం కూడా మనదే. దేశానికి ఎంతోకొంత చేయాలని యువత ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రగతిలో మీరంతా కీలకపాత్ర పోషించాలి” అని పిలుపునిచ్చారు. ‘‘మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి  భారత్ లో రెండే రెండు సెల్ ఫోన్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు రూ.18 వేల కోట్ల విలువైన సెల్ ఫోన్లను మనం ప్రపంచానికి అందిస్తున్నాం. యాపిల్ ఫోన్లను భారత్ లోనే 4 కంపెనీలు తయారు చేస్తున్నాయి” అని చెప్పారు.   

‘కేరళ స్టోరీ’ చూసిన కిషన్ రెడ్డి.. 

దేశంలో కొన్ని విద్రోహ శక్తులు మతమార్పిడులకు పాల్పడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. మహిళలను బలవంతంగా మతం మారుస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి నారాయణగూడలోని ఓ థియేటర్ లో ‘ది కేరళ స్టోరీ’ సినిమాను కిషన్ రెడ్డి చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా వాస్తవాలకు దగ్గరగా ఉందని చెప్పారు. ‘‘గతంలో దేశంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. మతం పేరుతో చేస్తున్న అరాచకాలను దర్శకుడు చక్కగా చూపించారు” అని చెప్పారు. 

ఇండియా కల్చర్  గొప్పదిజీ20 సమ్మిట్​లో 
విదేశీ ప్రతినిధుల ప్రశంస

భువనేశ్వర్, వెలుగు : ‘‘ఇండియా కల్చర్, భార తీయ వారసత్వ సంపద గొప్పది. ఇలాంటి సం స్కృతి, సంప్రదాయాలు, వారసత్వ సంపదను తెలుసుకునే అవకాశం దక్కడం గర్వంగా భావిస్తున్నాం” అని ఒడిశా రాజధాని భువనేశ్వర్  వేదికగా జరుగుతున్న జీ–20 సదస్సులో విదేశీ ప్రతినిధులు తెలిపారు. ఇండియా జీ20 ప్రెసిడెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో కల్చర్  వర్కింగ్  గ్రూప్ పేరిట సమావేశాలు నిర్వహిస్తోంది. 17 దేశాలు, 4 వరల్డ్ ఆర్గనైజేషన్ ల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో కిషన్  రెడ్డి మాట్లాడుతూ భారత వారసత్వ సంపదను ప్రపంచ దేశాలకు తెలిపేది జీ–20 ప్రతినిధులే అని అన్నారు. విదేశీ ప్రతినిధులు మన దేశానికి డెలిగేట్లు మాత్రమే కాదని, అంబాసిడర్లు కూడా అని ఆయన పేర్కొన్నారు.