
- సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరు: కిషన్‌రెడ్డి
- వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది
- సుప్రీంకు వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు వెల్లడి
హైదరాబాద్,వెలుగు: కేంద్రమంత్రిగా ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో తాను ఏం చేయగలనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వమే ఉందని, అయినా రిజర్వేషన్లపై ఏమీ చేయలేకపోయామని అన్నారు. అక్కడ ఎలక్షన్లు అయ్యాక బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని గుర్తుచేశారు. అసలు సుప్రీంకోర్టులో రిజర్వేషన్స్ 50 శాతం క్యాప్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనేనని తెలిపారు.
గతంలోనూ కాంగ్రెస్ విఫలం
గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల 50 శాతం క్యాప్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడంలో ఘోరంగా విఫలమైందని కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు హైకోర్టులోనూ ఫెయిల్ అయిందని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు తమ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తున్నదని వెల్లడించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి కోసం ముగ్గురి పేర్లను అధిష్టానానికి పంపించామని, పార్లమెంటరీ బోర్డ్ మీటింగ్ తర్వాత అభ్యర్థి ప్రకటన ఉంటుందని వెల్లడించారు.