ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలిచేది బీజేపీనే

ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలిచేది బీజేపీనే
  • ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలిచేది బీజేపీనే
  • కేంద్ర మంత్రి కృష్ణపాల్ గుర్జార్ 


వేములవాడ, వెలుగు :  తెలంగాణ అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కృష్ణపాల్ గుర్జార్ అన్నారు.  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపధ్యంలో వేములవాడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. నియోజకవర్గాల ఇంచార్జీలు పార్టీ బలాన్ని అంచనా వేయడమే కాకుండా, మరింత పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారన్నారు. గత 8 ఏండ్లలో మోడీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తమన్నారు.

టీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని,  క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేశారని, బీజేపీ అధికారంలోకి రాగానే ఇండ్లు, ఉద్యోగాలు ఇస్తామని భరోసా కల్పిస్తామన్నారు.  దేశంలో 18వేల గ్రామాల్లో విద్యుత్, మౌలిక వసతులు కల్పిస్తామని  హామీ ఇచ్చి ఏడాదిలోపే నెరవేర్చినట్టు చెప్పారు. బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. దేశంలో బీజేపీ ఎదుగుదలలో కార్యకర్త పాత్రే కీలకమని,  పార్టీ సంపద వారేనని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మాజీ జడ్పీ చైర్​పర్సన్​ తుల ఉమ, ఎంపీపీ బండ మల్లేశంయాదవ్​, లీడర్లు ఎర్రం మహేశ్​, రేగుల మల్లికార్జున్, రేగుల సంతోష్​ బాబు పాల్గొన్నారు.  


ప్రోటోకాల్ ​పాటించలేదని విమర్శ


 కేంద్ర మంత్రి కృష్ణ పాల్ గుర్జార్ పర్యటనలో ఆలయ ఈవో ప్రోటోకాల్​పాటించలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు.  కేంద్రమంత్రికి ఒక్క రూమ్​మాత్రమే కేటాయించారని, భద్రతా సిబ్బంది, ఇతర లీడర్ల ఆయన వెంట ఉన్నందున మరో గది కేటాయించాలని కోరినా స్పందించలేదన్నారు. మరోగది ఇవ్వరాదని ఈవో సిబ్బందిని ఆదేశించడం సరైందికాదన్నారు. అధికార పార్టీ లీడర్లకు రాచ మర్యాదలు చేసే అధికారులు ప్రతిపక్ష లీడర్లపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి పర్యటనలో ప్రొటోకాల్​పాటించామని, బీజేపీ లీడర్ల ఆరోపణలు అవాస్తవమని ఈవో  అన్నారు.