
- భారత్‌ను ధనికదేశంగా చేస్తాం
- కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో కేంద్ర బడ్జెట్‌ను.. ఖర్చుల రికార్డు నుంచి సంపద సమాన పంపిణీ విధానంగా మార్చిందని, సంస్కరణల వేగం పుంజుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం కొనసాగించడానికి ఇక నుంచి కూడా సంస్కరణలు కొనసాగిస్తామని ప్రకటించారు. కష్టపడి సంపాదించిన పన్ను చెల్లింపుదారుల డబ్బు విలువను, ప్రభావాన్ని ప్రభుత్వం గరిష్టంగా పెంచడం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు.
ఇది అందరి ప్రయోజనాల కోసం సాధ్యమైనంత సమర్థంగా వినియోగమవుతుందని భరోసా ఇచ్చారు. మోదీ ప్రభుత్వం తన బడ్జెట్ పద్ధతులలో, సంఖ్యలలో పారదర్శకతకు ప్రాధాన్యతను ఇస్తుందని మంత్రి అన్నారు. ‘‘పారదర్శక బడ్జెట్ల వల్ల ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు మనదేశాన్ని సానుకూలంగా చూస్తాయి. యూపీఏ ప్రభుత్వం -బడ్జెట్ రుణాలు, ఆయిల్ బాండ్ల జారీ ద్వారా లోటును దాచిపెట్టింది. రహస్యంగా భవిష్యత్ తరాలకు ఆర్థిక భారాన్ని బదిలీ చేసింది.
బడ్జెట్ సంఖ్యలు అనుకూలంగా కనిపించేలా చేయడానికి అక్రమాలకు పాల్పడింది’’ అని సీతారామన్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) పోస్ట్‌లో పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల నుంచి సేకరించిన ప్రతి రూపాయిని తెలివిగా, సమర్థవంతంగా ఉపయోగించుకుంటామని నిర్మల చెప్పారు.
సంస్కరణలతో సానుకూలతలు..
బడ్జెట్ ప్రక్రియను, పద్ధతులను బలోపేతం చేయడానికి, పారదర్శకతను తీసుకురావడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపట్టిందని మంత్రి చెప్పారు. బడ్జెట్ తేదీని ఫిబ్రవరి ఒకటో తేదీకి మార్చడం వల్ల ఎన్నో లాభాలు కలిగాయని ఆమె చెప్పారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థలకు నిధుల విడుదల కోసం ట్రెజరీ సింగిల్ అకౌంట్ (టిఎస్‌ఎ)ని తీసుకురావడం వల్ల రూ. 15 వేల కోట్లకు పైగా ఆదా అయ్యాయని ఆమె వెల్లడించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాల ద్వారా 108 కేంద్ర ప్రాయోజిత పథకాలను (సీఎస్ఎస్) నిర్వహిస్తోందని మంత్రి అన్నారు.
2024–-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ. 5.01 లక్షల కోట్ల బడ్జెట్ కాగా, రూ. 2023–-24 ఆర్థిక సంవత్సరానికి 4.76 లక్షల కోట్లు ఉందని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, పారదర్శకతను పెంపొందించడం, వికసిత్ భారత్ కోసం ఇక నుంచి కూడా సంస్కరణలను కొనసాగించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.