ఇన్విట్‌‌ల ద్వారా డబ్బు సమీకరణ

ఇన్విట్‌‌ల ద్వారా డబ్బు సమీకరణ

న్యూఢిల్లీ:  నాలుగు భారీ రోడ్ల ప్రాజెక్టులకు నిధుల కోసం వచ్చే నెలలో క్యాపిటల్ మార్కెట్‌‌కు ప్రభుత్వం వెళ్లనుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తెలిపారు. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌‌మెంట్ ట్రస్ట్‌‌ల (ఇన్విట్‌‌లు) ద్వారా డబ్బు సమీకరిస్తామని, రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా రూ.10 లక్షలు ఇన్వెస్ట్​ చేయవచ్చని, ఏడాదికి 7–-8 శాతం రాబడి ఉంటుందన్నారు. ఢిల్లీలో ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ గడ్కరీ ఈ విషయాలు చెప్పారు. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌‌మెంట్ ట్రస్ట్‌‌లు (ఇన్విట్‌‌లు)  మ్యూచువల్ ఫండ్‌‌ల మాదిరే ఉంటాయి. ఇవి పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించి  నిర్దిష్ట కాలంలో నిధులను అందించే ఆస్తులలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇదిలా ఉంటే, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌‌ఫర్ (బీఓటీ) మోడల్‌‌లో రోడ్డు మంత్రిత్వ శాఖ మరోసారి ప్రాజెక్టులను ప్రారంభించనుందని గడ్కరీ తెలిపారు. 2024 నాటికి జాతీయ రహదారుల నెట్‌‌వర్క్‌‌ను 2 లక్షల కిలోమీటర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు.

దేశంలోని జాతీయ రహదారుల (ఎన్‌‌హెచ్‌‌లు) మొత్తం పొడవు 2014 ఏప్రిల్ లో దాదాపు 91,287 కిలోమీటర్ల నుంచి నవంబర్ 2021 ముగింపు నాటికి  దాదాపు 1,40,937 కిలోమీటర్లకు పెరిగిందని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని ఇతర ఇంధనాలతో భర్తీ చేయడమే తన లక్ష్యమని గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు. రోడ్డు నిర్మాణం, నదుల అనుసంధానం, చెత్తను శుద్ధి చేయడం, పార్కింగ్ ప్లాజా, నీటిపారుదల, రోప్‌‌వేలు,  కేబుల్ కార్ ప్రాజెక్టులకు భారతదేశంలో భారీ అవకాశాలు ఉన్నాయని గడ్కరీ వివరించారు.  "మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి టెక్నాలజీ, పరిశోధన, ఆవిష్కరణలు,  విజయవంతమైన పద్ధతులను అనుసరించాలి. నాణ్యతలో రాజీ పడకుండా ఖర్చును తగ్గించడానికి ఇతర పదార్థాలను ఉపయోగించాలి. రోడ్ల నిర్మాణంలో పర్యావరణ అనుకూల మెటీరియల్​ను వాడుకోవాల్సి. మౌలిక సదుపాయాల ఇండస్ట్రీలు,  సిమెంట్ తయారీ కంపెనీలు   ముడి పదార్థాలకు ఇతర ప్రత్యామ్నాయాలను కనుగొనాలి”అని మంత్రి పిలుపునిచ్చారు. ఉక్కు స్థానంలో గ్లాస్ ఫైబర్ స్టీల్‌‌ను ఉపయోగించవచ్చని, పోటీ ఉంటే  ఖర్చు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ–-ముంబై ఎక్స్‌‌ప్రెస్‌‌వే పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ముంబైలోని నారిమన్ పాయింట్ నుండి ప్రయాణికులను  12 గంటల్లో ఢిల్లీకి తీసుకెళ్లడం తన కల అని, ఇప్పుడు అదే పనిపై ఉన్నామని అన్నారు.