మా పార్టీకి రేటింగ్​ ఎక్కువ.. అందుకే బాండ్లు ఎక్కువొచ్చినయ్​ : నితిన్ గడ్కరీ

మా పార్టీకి రేటింగ్​ ఎక్కువ.. అందుకే బాండ్లు ఎక్కువొచ్చినయ్​ : నితిన్ గడ్కరీ
  • టీఆర్పీ ఎక్కువున్న చానెల్స్​కే యాడ్స్ ఎక్కువొస్తయ్: నితిన్ గడ్కరీ
  • అట్లనే.. అధికారంలో ఉన్న పార్టీకే విరాళాలు దండిగ వస్తయ్
  • పార్టీ నడవాలంటే డబ్బులు కావాలి.. అది లీగల్​గా రావాలి
  • ఈసారి బీజేపీకి ఏపీ, తెలంగాణలో సీట్లు పెరుగుతాయని కామెంట్​

నాగ్​పూర్: కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతోనే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భారీగా విరాళాలు వచ్చాయని, ఇది సహజం అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. డొనేషన్లలో ఎప్పుడైనా రూలింగ్ పార్టీకే మేజర్ షేర్ ఉంటుందని తెలిపారు. ఉదాహరణకు.. మీడియా రంగంలో చూసుకుంటే.. టీఆర్పీ రేటింగ్ ఎక్కువ ఉన్న చానెల్స్​కే యాడ్స్ ఎక్కువ వస్తాయన్నారు. ప్రస్తుతం తమ పార్టీ అధికారంలో ఉందని, అందుకే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎక్కువ డొనేషన్లు వచ్చాయని తెలిపారు.

ఒకవేళ వేరే పార్టీ అధికారంలోకి వస్తే.. దానికి కూడా ఇలాగే పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చేవన్నారు. పార్టీ నడిపించాలంటే కచ్చితంగా డబ్బులు అవసరం అవుతాయని, కానీ.. ఆ డబ్బు లీగల్​గా వస్తే అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని తెలిపారు. 

కష్టపడ్డాం.. అందుకే రెండుసార్లు అధికారం..

ఎన్డీఏ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని, అందులో ఎలాంటి డౌట్ లేదని గడ్కరీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడో సారి ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కూటమి సీట్లు 400 దాటుతాయి. ఇందులో బీజేపీ 370 స్థానాల్లో గెలుస్తది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో మా బలం 288గా ఉంది. ఈసారి మరిన్ని ఎక్కువ స్థానాల్లో గెలుస్తాం. పదేండ్లలో దేశాన్ని మోదీ ఎంతో అభివృద్ధి చేశారు. గెలుపు మాత్రం మాదే.. దర్యాప్తు ఏజెన్సీలను ప్రతిపక్షాలపై మోదీ ప్రభుత్వం వెపన్​గా వాడుకుంటున్నదనడంలో ఎలాంటి నిజం లేదు. ఈడీ, సీబీఐ వాటి పని అవి చేసుకుంటున్నాయి’’అని స్పష్టంచేశారు. పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి బీజేపీని బలోపేతం చేశారని, అందుకే అధికారంలోకి వచ్చామన్నారు. ప్రజల విశ్వాసం పొందేందుకు కృషి చేయాలని అపోజిషన్ పార్టీలకు హితవు పలికారు.

దక్షిణాది రాష్ట్రాల్లో మా బలం పెరుగుతది

కూటమికి 400 సీట్లు ఎలా వస్తాయనేదానిపై గడ్కరీ లెక్కేసి చెప్పారు. ‘‘రాష్ట్రాల వారీగా ఎన్ని సీట్లు వస్తాయో చెప్పనవసరం లేదు. సౌత్​లో మా పార్టీ పుంజుకున్నది. పదేండ్ల మోదీ పాలనలో సౌత్, నార్త్​ ఈస్ట్​ను ఎంతో అభివృద్ధి చేశాం. అదేస్థాయిలో సీట్లు గెలుస్తాం. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఏపీ, కర్నాటకలో పెద్ద ఎత్తున డెవలప్​మెంట్ పనులు చేపట్టాం. ఈసారి తెలంగాణ, ఏపీలో 2019 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తాం. నార్త్ ఇండియాలో కూడా మా బలం పెరిగింది. అందుకే కూటమికి 400కు పైగా స్థానాలు వస్తాయంటున్నాను’’ అని చెప్పారు. ప్రధాని రేసులో మీరున్నారా? అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదన్నారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు.. మూడో సారి మోదీ ప్రధాని అనే రెండు విషయాలు తప్ప తన మైండ్​లో ఇంకేమీ లేవన్నారు.  

తప్పు చేస్తే.. ఏజెన్సీలు యాక్షన్ తీస్కుంటయ్

కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్​కు ఇన్​కమ్ ట్యాక్స్ నోటీసుల్లో తమ ప్రమేయం ఏమీలేదని గడ్కరీ స్పష్టం చేశారు. చట్టప్రకారం కేసులు నమోదయ్యాయన్నారు. ఇందులో బీజేపీ, మోదీ చేసిందేమీ లేదన్నారు. ఏజెన్సీలు వాటి పని అవి చేస్తున్నాయని చెప్పారు. ‘ఒకరి ఇంట్లో రూ.300 నుంచి 400 కోట్లు దొరికితే దర్యాప్తు ఏజెన్సీలు సాధారణంగానే విచారిస్తాయి. ఏమైనా తప్పు చేస్తే.. కచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అభ్యతరాలుంటే కోర్టుకు వెళ్లే ఆప్షన్ కూడా ఉంటుంది’ అని గడ్కరీ చెప్పారు.