
- బర్త్డే సందర్భంగా పంపిణీని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
- తొలి విడతగా 3 వేల మందికి అందజేత
- కలెక్టర్ పమేలా సత్పతి ఆలోచన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
కరీంనగర్, వెలుగు: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన బర్త్ డేను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ కానుకగా టెన్త్ స్టూడెంట్లకు సైకిళ్ల పంపిణీని ప్రారంభించారు. తన లోక్సభ నియోజకవర్గం కరీంనగర్లో మొత్తం 20 వేల సైకిళ్లు పంచాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా బుధవారం మొదటిరోజు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదికగా సుమారు 3 వేల మంది స్టూడెంట్లకు సైకిళ్లను పంపిణీ చేశారు. తొలుత కరీంనగర్ టౌన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్ స్టూడెంట్లందరికీ ఆయన స్వయంగా అందజేశారు.
కలెక్టర్ ఆలోచన మేరకు..
ప్రధాని నరేంద్ర మోదీ బాటలో నడుస్తూ తనకు చేతనైనంత సాయం చేస్తున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. సైకిళ్ల పంపిణీ ఆలోచన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇచ్చారని తెలిపారు. తన దగ్గరికి వచ్చిన కొందరు కార్పొరేట్ కంపెనీల యాజమానులతో మాట్లాడి సీఎస్సార్ ఫండ్ కింద సైకిళ్లు ఇవ్వాలని కోరితే వారు సానుకూలంగా స్పందించారని, వారిచ్చిన నిధులతో సైకిళ్లను కొని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
‘‘నేను చిన్నప్పటి నుంచి మీలాగే పేదరికంలో పెరిగిన. కష్టపడి ఈ స్థాయికి వచ్చిన. కష్టాలు తెలిసిన వ్యక్తిని కాబట్టే మీరు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని సైకిళ్లను పంపిణీ చేస్తున్నా. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ రోల్ మోడల్. మహాత్మాగాంధీ, అంబేద్కర్, మోదీ కూడా పేదరికం నుంచి ఎదిగినవాళ్లే. ముఖ్యంగా అంబేద్కర్ ఎన్ని కష్టాలు అనుభవించారో మాటల్లో చెప్పలేం. ఇప్పుడు మీ కష్టాలను తీర్చడానికి మోదీ ఉన్నారు. మేం చిన్నగున్నప్పుడు ఆదుకునే వాళ్లే లేరు” అని స్టూడెంట్లను ఉద్దేశించి ఆయన అన్నారు.
త్వరలో మోదీ కిట్స్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అతి త్వరలో ‘మోదీ కిట్స్’ను అందజేస్తామని బండి సంజయ్ చెప్పారు. తాను ఎంపీగా గెలిచానంటే అందులో 50 శాతం ఓట్లు పిల్లలు తమ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి వేయించినవేనని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు.