అన్నీ అబద్ధాలే.. సర్కార్ పై కేంద్రమంత్రి ఫైర్

అన్నీ అబద్ధాలే.. సర్కార్ పై కేంద్రమంత్రి ఫైర్

 

  • హుజూరాబాద్ ఓటమితో కేంద్రంపై కేసీఆర్ అబద్ధాలు: పీయూష్ గోయల్
  •  ఉప ఎన్నికల్లో ఓడించారని రైతుల్ని ఇబ్బంది పెడ్తున్నరు 
  • బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ముందే ఒప్పుకున్నరు.. 
  • ఇప్పుడేమో రాజకీయాలు చేస్తున్నరు
  • పోయినేడాది కోటా బియ్యమే ఇంకా ఇయ్యలే
  •  రా రైస్ ఎంతిచ్చినా తీస్కుంటమన్న కేంద్ర మంత్రి 

హైదరాబాద్‌‌, వెలుగు: వడ్ల కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర సర్కార్ చెప్పేవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోవడంతోనే సీఎం కేసీఆర్ ఇలా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉప ఎన్నికల్లో ఓడించారనే ప్రజలు, రైతులను కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌‌ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నేతలతో పీయూష్‌‌ గోయల్‌‌ సమావేశమయ్యారు. 

ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వడ్ల సేకరణలో తెలంగాణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని, స్పెషల్‌‌‌‌ కేస్‌‌‌‌ కింద ఆ ఒక్క రాష్ట్రం నుంచే బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ తీసుకుంటున్నామని పీయూష్ గోయల్ చెప్పారు. అయినా రాష్ట్ర సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తూ, రైతులను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రైతుల భవిష్యత్తు కోసం రాష్ట్ర బీజేపీ నేతలు కృషి చేస్తున్నారన్నారు. ఐదేండల్లో రాష్ట్రం నుంచి బియ్యం సేకరణను మూడు రెట్లు పెంచామని, రైతులకు ఇచ్చే మద్దతు ధరను ఐదుసార్లు పెంచామని గుర్తు చేశారు. 

 27 లక్షల టన్నుల బియ్యం బాకీ... 
‘‘పోయినేడాది కోటానే రాష్ట్ర సర్కార్ ఇంకా ఇవ్వలేదు. పోయిన యాసంగి సీజన్ లో ఎఫ్‌‌‌‌సీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణ నుంచి ఇంకా 14 లక్షల టన్నుల బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌, 13 లక్షల రా రైస్ రావాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర సర్కార్ తో చాలాసార్లు సంప్రదింపులు జరిపాం. నాలుగుసార్లు గడువు కూడా పొడిగించాం. అయినా బియ్యం ఇవ్వడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైంది’’ అని పీయూష్ గోయల్ చెప్పారు. రాష్ట్ర సర్కార్ పోయినేడాది కోటా ఇవ్వకుండానే, వచ్చే సీజన్ కు సంబంధించి మాట్లాడుతూ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం పేరు చెప్పి, రాష్ట్ర సర్కార్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ వానాకాలంలో రా రైస్‌‌‌‌ ఎంతిచ్చినా తీసుకుంటామని పదే పదే చెప్పామని, అయినా దాన్ని వివాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర సర్కార్ వీలైనంత త్వరగా పోయినేడాది కోటా బియ్యం ఇవ్వాలన్నారు.  

తెలంగాణ మంత్రులు రాజకీయం చేస్తున్రు.. 
తాను ముంబైలో ఉన్నప్పుడు తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వచ్చి కూర్చోవడం ఏమిటని పీయూష్ గోయల్ ప్రశ్నించారు. పార్లమెంట్‌‌‌‌ సమావేశాల్లో కేంద్ర మంత్రులంతా బిజీగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ మంత్రులు ప్రజల కోసం పని చేయకుండా, రాజకీయం చేయడానికే ఇష్టపడుతున్నారని విమర్శించారు. తనతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డిపై తెలంగాణ మంత్రులు చేసిన కామెంట్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌‌‌‌సీఐతో రాష్ట్ర సివిల్‌‌‌‌ సప్లయ్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేసుకున్న ఒప్పందంలోని 18వ క్లాజ్‌‌‌‌లోనే తాము రా రైస్‌‌‌‌ తీసుకుంటామని స్పష్టంగా ఉందన్నారు. నాలుగేళ్లకు సరిపడా బియ్యం నిల్వలు ఎఫ్‌‌‌‌సీఐ దగ్గర ఉన్నాయని, సెంట్రల్‌‌‌‌ పూల్‌‌‌‌ కింద రా రైస్‌‌‌‌ మాత్రమే ఇవ్వాలన్నారు. 

హుజూరాబాద్ ఓటమి తర్వాతే తెరపైకి బియ్యం అంశం: కిషన్ రెడ్డి  
హుజూరాబాద్‌‌‌‌ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాతే కేసీఆర్‌‌‌‌ బియ్యం అంశాన్ని ఎత్తుకున్నారని కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి చెప్పారు. రాష్ట్ర సర్కార్ చేతగానితనం వల్లే పోయిన యాసంగి టార్గెట్ ను పూర్తి చేయలేదన్నారు. ఎఫ్‌‌‌‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యం ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. భవిష్యత్‌‌‌‌లో బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ కొనబోమని కేంద్రం రాతపూర్వకంగా గతంలోనే చెప్పిందని స్పష్టం చేశారు. వడ్ల సేకరణ ఖర్చంతా కేంద్ర ప్రభుత్వానిదేనని, అయినా కేసీఆర్‌‌‌‌ తానే బియ్యం కొనుగోలు చేస్తున్నట్టు చెప్పుకున్నారని మండిపడ్డారు. సీజన్‌‌‌‌తో సంబంధం లేకుండా ఎంత రా రైస్‌‌‌‌ ఇచ్చినా తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.

రాష్ట్ర సర్కార్ మాటలు నమ్మొద్దు.. 
దేశంలో బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ వినియోగం తగ్గిందని, తెలంగాణలో అస్సలు ఆ బియ్యమే తినరని పీయూష్ గోయల్ చెప్పారు. అయినా రాష్ట్ర రైతుల కోసమే బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ అదనంగా సేకరిస్తున్నామని తెలిపారు. ‘‘బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌పై ఏడాది కిందనే చర్చించాం. స్టాక్‌‌‌‌ ఎక్కువైందని ముందే చెప్పాం. అయినప్పటికీ పోయిన యాసంగిలో రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి మేరకు అదనంగా బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ తీసుకున్నాం” అని స్పష్టం చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఉపయోగించే రా రైసే ఇవ్వాలని రాష్ట్ర సర్కార్​కు లేఖ రాశామని చెప్పారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒప్పుకుందని, బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ ఇవ్వబోమని రాసిచ్చిందని తెలిపారు. కానీ ఇప్పుడు రైతులకు అబద్ధాలు చెప్తూ మభ్య పెడుతోందన్నారు. తెలంగాణ రైతులు సర్కార్ పెద్దలు చెప్పే మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుంచి బియ్యం ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నా, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎలా బియ్యం ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేస్తామనేది తమ సమస్య అని.. ఎన్ని రేక్‌‌‌‌లు కావాలన్నా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇవ్వకుండా ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ గురించి మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు. తన ఫెయిల్యూర్‌‌‌‌ను కప్పిపుచ్చుకోవడానికే రాష్ట్ర సర్కార్ ఇలాంటి ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు.