రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి గాయాలు..ఆయన భార్య, పీఏ మృతి

రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి గాయాలు..ఆయన భార్య, పీఏ మృతి

బెంగళూరు: కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్​ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురైంది. కర్నాటకలో యల్లాపూర్ ​నుంచి గోకర్ణ వెళుతుండగా ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకెళ్లింది. అంకోలా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో మంత్రికి తీవ్రగాయాలు కాగా, ఆయన భార్య విజయ, అనుచరుడు దీపక్​ ప్రాణాలు కోల్పోయారు. మంత్రి శ్రీపాద నాయక్​ను మెరుగైన ట్రీట్​మెంట్​ కోసం గోవా తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గాయాలపాలైన కారు డ్రైవర్​ సూరజ్​ నాయక్, మంత్రి గన్​మెన్​ తుకారం పాటిల్, సాయికిరణ్​ సేథియాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో మంత్రి సతీమణి విజయ చనిపోవడంపై ప్రధాని మోడీ సహా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శ్రీపాద తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రికి మెరుగైన వైద్యం అందేలా చూడాలంటూ ప్రధాని మోడీ గోవా సీఎం ప్రమోద్  సావంత్​కు ఫోన్​లో సూచించారు. అవసరమైతే ఢిల్లీకి తరలించాలని చెప్పారు. మంత్రి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్​కు గురైందన్న వార్త తనను షాక్​కు గురిచేసిందని కర్నాటక సీఎం యడియూరప్ప చెప్పారు. శ్రీపాద, ఆయన అనుచరులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. డిఫెన్స్​ మినిస్టర్​ రాజ్​నాథ్​ సింగ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ కర్నాటక​ఎమ్మెల్యే ఆర్​వి దేశ్​పాండే తదితరులు విచారం వ్యక్తం చేశారు.