బిర్సా ముండా అనుచరులకు కేంద్రమంత్రుల సన్మానం

బిర్సా ముండా అనుచరులకు కేంద్రమంత్రుల సన్మానం

గిరిజన స్వాతంత్ర్య సమర యోధుడు బిర్సాముండా జయంతి నేడు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం  బిర్సా జయంతిని ‘జంజతియ గౌరవ్ దినోత్సవ్’ గా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బిర్సా  జన్మస్థలం ఖుంటి జిల్లాలోని ఉలిహతు గ్రామంలో పలువురు కేంద్ర మంత్రులు పర్యటించారు. కేంద్రమంత్రి అర్జున్ ముండా, కిషన్ రెడ్డి బుర్సాముండా అనుచరుల్ని కలిశారు. వారి కాళ్లు కడిగి సన్మానించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరోవైపు బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని మోదీ రాంచీలో మ్యూజియంను కూడా ప్రారంభించారు.

స్వాతంత్ర్య సమరయోధుడు, జల్-జంగల్-జమీన్ ఉద్యమ నేత బిర్సా ముండా గుర్తుగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలో మ్యూజియాన్ని ప్రారంభించారు నరేంద్రమోదీ. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరేన్స్‌లో పాల్గొన్న మోదీ.. రిమోట్ ద్వారా మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ బిర్సా ముండా చేసిన సేవ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కొనియాడారు. ఆదివాసీల కోసం ఆయన ఎంతో పోరాటం చేశారని, స్వాతంత్ర్యం కోసం పదునైన ఉద్యమాన్ని చేపట్టారని మోదీ అన్నారు.

అనంతరం ప్రధాని మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అనంతరం ఆదివాసి, గిరిజనుల ప్రయోజనార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు ఆదివారం పీఎంవో పేర్కొంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం బిర్సా ముండాకు నివాళులర్పించారు. స్వ‌రాజ్యం కోసం, ఆదివాసీ గిరిజ‌నుల ఆత్మ‌గౌర‌వం కోసం పోరాడుతూ, అతి చిన్న వ‌య‌సులో బిర్సా ముండా ప్రాణ‌త్యాగం చేశార‌ని కొనియాడారు. 1875 నవంబర్ 15న జన్మించిన బిర్సా ముండా.. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటం నిర్వహించారు. ఈ పోరాటంలో కొనసాగిస్తూనే 1900 ఏడాదిలో అతి చిన్న వయసులో (25) ఆయన రాంచీ జైలులోనే మృతి చెందారు.