రియల్ దందా కోసమే ఉర్దూ వర్సిటీ భూములు లాక్కుంటున్నరు : కిషన్ రెడ్డి

రియల్ దందా కోసమే ఉర్దూ వర్సిటీ భూములు లాక్కుంటున్నరు : కిషన్ రెడ్డి
  •     రాష్ట్ర సర్కార్‌‌‌‌పై కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్‌‌లోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ (మను) నుంచి 50 ఎకరాలు వెనక్కి తీసుకుంటామంటూ కలెక్టర్ నోటీసులివ్వడంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర సర్కారు పెద్దలు వేల కోట్ల విలువైన భూములను అమ్మి, దోచుకోవాలనుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. 

‘‘వర్సిటీల్లో కనీస సౌకర్యాలు కల్పించడం చేతగాని ప్రభుత్వం.. ఉన్న భూములను లాక్కోవడం సిగ్గుచేటు. పాతబస్తీలో సల్కం చెరువును కబ్జా చేసిన ఒవైసీపై చర్యలు తీసుకోలేని సర్కార్.. విద్యార్థుల భవిష్యత్ అవసరాల కోసం ఉన్న భూములపై పడితే ఊరుకోం. విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం” అని హెచ్చరించారు. 

రాష్ట్రంలో విద్యావ్యవస్థను ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.. యూనివర్సిటీల భూములను కాజేయడమే పనిగా పెట్టుకుందని, దీనికోసం మిషన్ మోడ్‌‌లో పనిచేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ‘‘మొన్న హెచ్‌‌సీయూ భూములను ప్రైవేటు పరం చేయబోయి సుప్రీంకోర్టుతో మొట్టికాయలు తిన్నారు. ఇప్పుడు ఉర్దూ వర్సిటీపై పడ్డారు. ల్యాండ్ బ్యాంక్ పేరుతో రియల్ దందా చేస్తూ ఖజానా నింపుకోవడానికే రేవంత్ రెడ్డి సర్కారు ఆసక్తి చూపిస్తోంది” అని మండిపడ్డారు.