
- లోక్‌సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పోడు భూముల వివాదాలు లేవని ఆ రాష్ట్ర సర్కార్ సమాచారం ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గురువారం లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పోడు భూములు, ఫారెస్ట్ భూముల సమస్యల గురించి ప్రస్తావించారు. చెన్నూరులో పోడు భూ వివాదాల పరిష్కారం, భూమి హక్కు పంపిణీని వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏవైనా ప్రతిపాదనలు లేదా అభ్యర్థనలు అందాయా? అని అడిగారు.
.ఆ అభ్యర్థనలపై తీసుకున్న చర్యలు, వాటి వివరాలు ఇవ్వాలని కోరారు. అలాగే, గత ఐదేండ్లలో అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్ఏ) అమలు కోసం తెలంగాణకు కేటాయించిన, పంపిణీ చేసిన నిధుల వివరాలను అడిగారు. మరోవైపు, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పోడు భూ వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్దేశించిన సమయం గురించి చెప్పాలని వంశీకృష్ణ కోరారు.
ఈ ప్రశ్నలకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి దుర్గా దాస్ యూకీ రాతపూర్వ సమాధానం ఇచ్చారు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ – 2006 ప్రకారం.. చట్టం అమలు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక హక్కు అని మంత్రి తెలిపారు. అలాగే, తెలంగాణతో సహా ఏ రాష్ట్రం నుంచి కూడా భూమి పంపిణీ కోసం ఈ మంత్రిత్వ శాఖకు ఎలాంటి ప్రతిపాదన లేదా అభ్యర్థన అందలేదని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో పోడు భూ వివాదాలు లేవని తెలంగాణ ప్రభుత్వం తమకు సమాచారం ఇచ్చిందని చెప్పారు.