
బెంగళూర్: త్వరలో వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. మూడు నెలల్లో వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ ను ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఆదివారం బెంగళూర్ లోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) ఫెసిలిటీలో వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ కోచ్ ప్రొటోటైప్ ను ఆయన ఆవిష్కరించారు. బీఈఎంఎల్ ప్రాంగణంలో వందేభారత్ తయారీ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు.
వందేభారత్ చైర్ కార్ విజయవంతమైన తర్వాత వందేభారత్ స్లీపర్ కోసం ఎంతో శ్రమించామని ఆయన తెలిపారు. ‘‘వందేభారత్ స్లీపర్ కార్స్ తయారీ పూర్తయింది. ఇప్పుడిక అన్ని రకాల టెస్టులు నిర్వహించాల్సి ఉంది. అవన్నీ విజయవంతమైతే ఉత్పత్తి ప్రారంభిస్తాం. రానున్న మూడు నెలల్లో వందేభారత్ స్లీపర్ ట్రైన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది” అని చెప్పారు. ‘‘ఒక కొత్త ట్రైన్ ను తయారు చేయడం అంత ఈజీ పని కాదు. వందేభారత్ స్లీపర్ లో మరికొన్ని సౌలతులు అందుబాటులోకి తెస్తున్నాం. ఈ ట్రైన్ లో 16 కోచ్ లు ఉంటాయి.
800–1,200 కిలోమీటర్ల జర్నీకి స్లీపర్ ట్రైన్లను అందుబాటులోకి తెస్తాం. ఇవి మిడిల్ క్లాస్ కోసం తయారు చేస్తున్న రైళ్లు. రాజధాని ఎక్స్ ప్రెస్ తో సమానంగా టికెట్ రేట్లు ఉంటాయి” అని వివరించారు. కాగా, వందేభారత్ లో ఫుడ్ క్వాలిటీపై వస్తున్న కంప్లయింట్లపై మీడియా ప్రశ్నించగా.. ‘‘రైల్వే శాఖ ప్రతిరోజు 13 లక్షల మీల్స్ అందజేస్తున్నది. అందులో కంప్లయింట్స్ 0.01 శాతమే. అయినప్పటికీ ఆ కంప్లయింట్లపై మేం సీరియస్ గా దృష్టిసారించాం. తప్పు చేసిన సప్లయర్లు, క్యాటరర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం” అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.