బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ కీలక ప్రకటన

బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ  కీలక ప్రకటన
  • తెలంగాణ అభ్యంతరాలు అందినయ్​
  • ఎలాంటి పనులు చేపట్టలేదని ఏపీ చెప్పింది
  • రాజ్యసభలో ఎంపీ అనిల్​ ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజ్ భూషణ్​ రిప్లై

న్యూఢిల్లీ, వెలుగు:  ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన పోలవరం– -బనకచర్ల లింక్ ప్రాజెక్ట్  విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు అందాయని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. గోదావరి బేసిన్​లోని తెలంగాణతో పాటు భాగస్వామ్య రాష్ట్రాలను సంప్రదించిన తర్వాతే ఈ లింక్  ప్రాజెక్ట్​కు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక అంచనాలపై ముందుకెళ్తామని స్పష్టం చేసింది.

ఈ మేరకు సోమవారం రాజ్యసభలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్​ చౌదురి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం–-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్​కు సంబంధించి  సాంకేతిక-, ఆర్థిక అంచనాల కోసం ఏపీ ప్రభుత్వం  జలశక్తి శాఖను అభ్యర్థించిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా జలశక్తి శాఖ ఆధ్వరంలోని సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)కు ప్రిలిమినరీ ప్రీజిబిలిటి రిపోర్ట్ (పీఎఫ్ఆర్)ను అందజేశారని వెల్లడించారు. అయితే, ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి పనులను ఇంకా చేపట్టలేదని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలిపిందని  సమాధానంలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు.