బెల్లంపల్లి రీజియన్​పైనే యూనియన్ల కన్ను

బెల్లంపల్లి రీజియన్​పైనే యూనియన్ల కన్ను
  • సింగరేణిలో మూడో వంతుకుపైగా కార్మికులు ఈ ప్రాంతంలోనే
  • ఒక్క శ్రీరాంపూర్​లోనే 9,124 ఓటర్లు
  • ఈ బెల్ట్ లో ఎక్కువ ఓట్లు సాధించిన వారిదే గెలుపు

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణిలో ఏడో దఫా జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మిక సంఘాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్​లు గుర్తింపు హోదా కోసం తీవ్రంగా యత్నిస్తున్నాయి. సంఘాల గెలుపు ఓటములు ప్రభావం చేసే ఏరియాల్లో  ప్రాతినిధ్య హోదాను దక్కించుకుంటే సింగరేణిలోని మిగతా ఏరియాల్లో వచ్చిన ఓట్లతో మెజారిటీ సాధించవచ్చనేది సంఘాల ధీమా. ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లోని నాలుగు ఏరియాల్లో ఉన్న మొత్తం ఓట్ల కన్నా ఒక్క శ్రీరాంపూర్​ ఏరియాలో అత్యధికంగా ఓట్లు ఉన్నాయి. దీంతో ఇక్కడ సంఘాలు తమ శక్తి మేర పోరాడుతున్నాయి. అలాగే మందమర్రి, ఆర్జీ1, ఆర్జీ2, ఆర్జీ3, భూపాలపల్లి ఏరియాల్లో మోజారిటీ ఓట్లు సాధిస్తే గుర్తింపు సులభంగా దక్కుతుంది.

మంచిర్యాల జిల్లాలో ముమ్మర ప్రచారం

ఓట్ల రాజకీయాలు కార్మిక సంఘాలకూ పాకాయి. అందుకే ఎక్కువ ఓట్లు రాలే ప్రాంతాల్లో ప్రచారానికి పెద్దపీట వేస్తున్నారు. కార్మికులు ఎక్కువగా ఉన్న బెల్లంపల్లి, రామగుండం రీజియన్లలోనే అగ్ర నాయకుల పర్యటనలను, ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కార్మిక సంఘాలు ఆసక్తి చూపుతున్నాయి. కొత్తగూడెం రీజియన్​లోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో కార్మికుల సంఖ్య కన్నా బెల్లంపల్లి ప్రాంతంలోని ఒక ఏరియాలో కార్మికుల సంఖ్య ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. కార్మికులు ఎక్కువగా ఉన్న చోట ముమ్మరంగా ప్రచారం చేస్తే దాని ఫలితం అధికంగా ఉంటుందని ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా, కరీంనగర్​ జిల్లా నేతలు భావిస్తున్నారు. ప్రధానంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, మందమర్రి, రామగుండం, భూపాలపల్లి ఏరియాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. సింగరేణిలో 39,748 ఓటర్లు ఉంటే అందులో ఒక బెల్లంపల్లి రీజియన్​లోనే 14,985 మంది ఓటర్లున్నారు. సమీపంలోని రామగుండం రీజియన్​లో (పెద్దపల్లి జిల్లా) ఆర్జీ1, ఆర్జీ2, ఆర్జీ3 ఏరియాలతో పాటు  భూపాలపల్లి ఏరియాలో (భూపాలపల్లి జిల్లా) 18,266 ఓట్లు ఉన్నాయి.  దీంతో బెల్లంపల్లి ప్రాంతం నుంచి ప్రచారం చేస్తే 14,985 ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. అలాగే సింగరేణిలో అత్యధిక కార్మికులున్న ఏరియాగా శ్రీరాంపూర్​కు గుర్తింపు ఉంది. ఇక్కడ 9,124  ఓటర్లు ఉన్నారు. దీంతో కీలక లీడర్లంతా శ్రీరాంపూర్​ ఏరియాలోనే ప్రచారం చేస్తున్నారు.

ఉదయం గనులకు.. సాయంత్రం ఆఫీసులకు

బెల్లంపల్లి రీజియన్​ పరిధిలోని మందమర్రి, శ్రీరాంపూర్​, బెల్లంపల్లిలో పలు సంఘాల లీడర్లు ఎన్నికల ప్రచారం కోసం ఉదయమే బొగ్గు గనులకు చేరుకుంటూ గేట్​ మీటింగ్​లు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా శ్రీరాంపూర్​ ఏరియాలో అత్యధికంగా ఏడు అండర్ గ్రౌండ్​ బొగ్గు గనులు, రెండు ఓసీపీలు ఉన్నాయి. ఇక్కడ మొదటి, రెండో షిప్టుల్లో గనులపై జోరుగా ప్రచారం సాగుతోంది. మందమర్రి ఏరియాలో నాలుగు అండర్​గ్రౌండ్​ గనులు, రెండు ఓసీపీలు, బెల్లంపల్లి ఏరియాలో ఒక ఓసీపీ ఉంది. సాయంత్రం లీడర్లు సంఘాల ఆఫీసులకు చేరుకొని చర్చించుకుంటున్నారు. దీంతో సంఘాల  కార్యాలయాలు సాయంత్రం లీడర్లు, కార్యకర్తలతో కళకళలాడుతున్నాయి.