అలా ఏకమైతేనే 2024లో బీజేపీని ఎదుర్కోగలం

అలా ఏకమైతేనే 2024లో బీజేపీని ఎదుర్కోగలం

ఫతేహాబాద్: బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో సహా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. అలా ఏకమైతేనే 2024లో బీజేపీని ఎదుర్కోగలమని ఆయన అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘోరంగా ఓడిపోయేలా విపక్షాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాలు ఏకమైతే దేశాన్ని నాశనంచేస్తున్న వారి నుంచి బయటపడవచ్చన్నారు. మాజీ డిప్యూటీ ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఆదివారం హర్యానాలోని ఫతేహాబాద్ లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్డీ) మెగా ర్యాలీ నిర్వహించింది. నితీశ్​తో పాటు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఎన్సీపీ చీఫ్​ శరద్ పవార్, శిరోమణి అకాలీ దళ్ ప్రెసిడెంట్ సుఖ్ బీర్ సింగ్ బాదల్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, శివసేన లీడర్ అర్వింద్ సావంత్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు లేకుండా ప్రతిపక్షాల ఫ్రంట్​ను ఊహించలేమని, ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ కలిసి పనిచేయాలని వేదికపై ఉన్న నేతలకు ఆయన సూచించారు. థర్డ్ ఫ్రంట్ వంటివీ ఏమీ లేవని, ప్రస్తుతం ప్రతిపక్షాల ఫ్రంట్ ఒక్కటే అవసరమన్నారు.

ప్రభుత్వాన్ని మార్చే టైమ్ వచ్చింది: పవార్

2024లో కేంద్రంలో సర్కారును మార్చేందుకు ప్రతిఒక్కరికీ టైమ్ వచ్చిందని ఎన్సీపీ చీఫ్​ శరద్ పవార్ అన్నారు. నిరుడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన నిరసన ప్రదర్శనలపై స్పందిస్తూ ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావని, కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చడం ఒక్కటే నిజమైన పరిష్కారమన్నారు.

బీజేపీ ఓ ఝూటా పార్టీ: తేజస్వీ

ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకే జేడీయూ, అకాలీ దళ్, శివసేన కేంద్రంలోని బీజేపీని వీడాయని ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు ఎప్పుడూ అబద్ధాలే మాట్లాడతారని, అదొక ఝూటా పార్టీ అని ఆయన మండిపడ్డారు. బీహార్​లోని పూర్నియాలో ఎయిర్ పోర్ట్ గురించి కేంద్ర హోం మంత్రి ఇటీవలే మాట్లాడారని, వాస్తవానికి పూర్నియా సిటీలో ఎయిర్ పోర్టే లేదని ఆయన తెలిపారు.