
ఢిల్లీ: అయోధ్యలో ప్రతిష్టించిన రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహానికి జీవం పోసిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్కు అమెరికా వీసా విషయంలో నిరాశ ఎదురైంది. ఆయనకు, ఆయన కుటుంబానికి యూఎస్ వీసా ఇచ్చేందుకు అమెరికా నిరాకరించింది. ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకూ అమెరికాలోని వర్జీనియాలో జరగనున్న ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్కు అరుణ్ యోగిరాజ్ వెళ్లాల్సి ఉంది. ఆయనకు ఈ మేరకు ఆహ్వానం అందింది. దీంతో.. అమెరికా వెళ్లేందుకు అరుణ్ యోగిరాజ్, ఆయన కుటుంబం ఏర్పాట్లు చేసుకున్నారు. కారణం ఏంటో తెలియదు గానీ అరుణ్ యోగిరాజ్కు, ఆయన కుటుంబానికి యూఎస్ వీసా అఫ్రూవ్ కాలేదు.
యోగిరాజ్తో పాటు ఆయన భార్య విజేత కూడా ఈ పరిణామంపై విస్మయం వ్యక్తం చేశారు. అరుణ్ యోగిరాజ్ భార్య విజేత గతంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా అమెరికా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్కు హాజరై తిరిగి ఇండియా రావాలని యోగిరాజ్ కుటుంబం భావించింది. అమెరికా ఆయనకు వీసా ఎందుకు నిరాకరించిందో అరుణ్ యోగిరాజ్కు కూడా అంతుపట్టడం లేదు. వీసాకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఇలా వీసా నిరాకరించడం ఏంటో అర్థం కావడం లేదని యోగిరాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అయోధ్యలో ఐదేండ్ల వయసులోని బాల రాముడి రూపం తొణికిసలాడేలా ఉన్న కృష్ణ శిలా విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. అయోధ్య గర్భగుడిలో కొలువైన బాల రామయ్య ముఖంలో తేజస్సు ఉట్టిపడేలా శిల్పం చెక్కిన అరుణ్ యోగిరాజ్కు వీసా నిరాకరించారనే వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన చేతులతో చెక్కిన బాల రాముడి విగ్రహ సుందర రూపం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నల్లగా నిగనిగలాడుతున్న శరీరం.. ముఖంలో అద్భుతమైన వర్చస్సు చూడగానే తన్మయత్వానికి లోను చేసేలా కనిపిస్తోంది. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బాల రాముడి విగ్రహాన్ని పసుపు పచ్చటి ధోతి, రత్న ఖచిత, స్వర్ణాభరణాలు, ఎరుపు, పసుపు, ఊదా రంగు పూల మాలలతో అందంగా అలంకరించారు. రఘువంశ ముద్రతో కూడిన అందమైన కిరీటం, కంఠాభరణం, కాళ్లకు బంగారు కడియాలు తొడిగారు. గర్భగుడిలో ఎత్తైన వేదికపై బాల రాముడి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే.