నిర్మల్లో ఆకట్టుకున్న యూనిటీ మార్చ్.. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు

నిర్మల్లో ఆకట్టుకున్న యూనిటీ మార్చ్.. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు

నిర్మల్, వెలుగు: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలో సోమవారం సాయంత్రం ‘యూనిటీ మార్చ్’ను ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్, నిర్మల్, ముథోల్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. 

ముందుగా పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు ర్యాలీ సాగింది. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ నగేశ్ మాట్లాడుతూ.. ఉక్కుమనిషి సర్దార్ వల్ల భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని యూనిటీ మార్చ్​ నిర్వహించామని, దేశానికి ఆయన సేవలు వెలకట్టలేనివన్నారు. 

ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం తర్వాత కూడా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో కలపడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరువ మరువలేనిదన్నారు. దేశ ఐక్యత కోసం ప్రతిక్షణం పరితపించిన మహనీయుడు వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. 

ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. వల్లభాయ్ పటేల్ ఐక్యతాస్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత నేటితరం యువతపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకల్యాణి, జిల్లా యూత్ ఆఫీసర్ శైలి బెల్లాల్, డీవైఎస్ వో శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, స్టూడెంట్లు, టీచర్లు, అధికారులు  తదితరులు పాల్గొన్నారు.