
- గైడ్ లైన్స్ రిలీజ్ చేసి 4 నెలలైనా ముందుకు కదలని రిక్రూట్‌మెంట్
- రాష్ట్రవ్యాప్తంగా వర్సిటీల్లో 2,125 పోస్టులు ఖాళీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పోస్టులపై భర్తీపై జాప్యం జరుగుతోంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం ప్రభుత్వం గైడ్‌లైన్స్ రిలీజ్ చేసి 4 నెలలు కావొస్తున్నా, ఇప్పటికీ భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో రిక్రూట్‌మెంట్ కోసం కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ గత బీఆర్ఎస్ సర్కారు నిర్ణయం తీసుకుంది.
దీనిపై అప్పటి గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా.. రాష్ట్రపతికి పంపించారు. దీంతో అది అక్కడే పెండింగ్‌లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మళ్లీ పాత విధానంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి, కొత్త గైడ్ లైన్స్ రూపొందించింది.
అయితే, ఈ కమిటీ రిపోర్ట్‌ను ఏప్రిల్‌లోనే ఇచ్చినా, ఇప్పటికీ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సమావేశాలు పూర్తికాకపోవడం గమనార్హం. రాష్ట్రంలో గతేడాది డిసెంబర్ 31 నాటికి మంజూరైన పోస్టులు 2,878 ఉండగా, వీటిలో 753 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 2,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల మంజూరు కోసం వర్సిటీ ఈసీల్లో ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం నాలుగైదు యూనివర్సిటీలు మాత్రమే ఈసీలు నిర్వహించాయి. రోస్టర్ పాయింట్ల తయారీపై జాప్యం జరుగుతూనే ఉంది. సరిగ్గా ఏడాది క్రితం సీఎం రేవంత్ రెడ్డి.. వీసీలను నియమిస్తామని, ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇందులో రెండు, మూడు వర్సిటీలు మినహా మిగిలిన వర్సిటీలకు కొత్తగా రెగ్యులర్ వీసీలు వచ్చినా, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది.
ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో ప్రకారం కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నది. అయితే, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి కమిటీ ఇచ్చిన రిపోర్టుపై వర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళనలు చేశారు. దీంతో ప్రభుత్వం వారిని డిస్టర్బ్ చేయకుండా, మిగిలిన ఖాళీలను భర్తీ చేసుకోవాలని సూచింది. వర్సిటీల వారిగా రిక్రూట్‌మెంట్ చేసుకోవాలని అనుమతి ఇచ్చాక కూడా.. వర్సిటీలు ముందుకు రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా వర్సిటీల్లో రిక్రూట్‌మెంట్‌పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని విద్యార్థి సంఘాలు, లెక్చరర్ల సంఘాలు కోరుతున్నాయి.