ఉన్నావ్ కేస్ : ప్రమాదానికి వారం ముందే సెక్యూరిటీ అడిగారు

ఉన్నావ్ కేస్ : ప్రమాదానికి వారం ముందే సెక్యూరిటీ అడిగారు

ఉన్నావ్ రేప్ కేసు మలుపులు తిరుగుతోంది. ఆదివారం రోజున యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉన్నావ్ రేప్ బాధితురాలి ఇద్దరు బంధువులు ప్రాణాలు కోల్పోయారు. ఐతే.. ఈ సంఘటన జరగడానికి వారం రోజుల ముందే ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలికి సెక్యూరిటీ కల్పించాలని పోలీసులకు లెటర్ రాశారు. ఆ లెటర్ ఇపుడు బయటకొచ్చింది.

ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలి హత్యకు కుట్ర జరుగుతోందంటూ జిల్లా మెజిస్ట్రేట్ కు లాయర్ మహేంద్ర సింగ్ లెటర్ రాశారు. జులై 15వ తేదీన జడ్జీకి ఈ అప్లికేషన్ పెట్టుకున్నారు. కొద్దిరోజుల్లోనే బాధితురాలిపై హత్యాయత్నాలు జరగబోతున్నట్టు అనుమానాలు వస్తున్నాయని..  ఆమెకు సెక్యూరిటీ కల్పించాలనీ… ఆత్మ రక్షణ కోసం అత్యవసరంగా ఓ ఆయుధాన్ని అందించి సహాయం చేయాలని లెటర్ లో కోరారు.

ఈ లెటర్ ను జిల్లా మెజిస్ట్రేట్ కు పంపిన వారం రోజుల్లోనే జులై 28న బాధితురాలి కారుకు యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బంధువులు చనిపోయారు.

యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడంటూ ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు గతేడాది ఏప్రిల్ లో ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ సంఘటన దేశమంతటా సంచలనం రేపింది. ఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే పోలీస్ కస్టడీలో ఉండగా బాధితురాలి తండ్రి చనిపోయాడు. ఈ హత్యకు సాక్షి కూడా 2 నెలల్లోనే చనిపోయాడు. తాజాగా.. బాధితురాలి కారును… నల్లరంగు నంబర్ ప్లేట్ ఉన్న లారీతో ఢీకొట్టింది.