- రైతులను వెంటాడుతున్న అకాల వర్షాల భయం
- సరిహద్దు మండలాల్లో కర్నాటక రాష్ట్రానికి తరలుతున్న ధాన్యం
మహబూబ్‌నగర్, వెలుగు: వడ్ల కొనుగోళ్ల విషయంలో వచ్చిన కొత్త రూల్ రైతులకు గుదిబండలా మారుతోంది. నిరుడు 17 శాతం మాయిశ్చర్ ఉంటేనే వడ్లను కొనుగోలు చేయగా.. తాజా సీజన్లో వడ్లలో తాలు ఉన్నా నిర్వాహకులు వడ్లు కొంటలేరు. తాలు లేని వడ్లను మాత్రమే కొనాలని ప్రభుత్వ నుంచి వడ్ల కొనుగోలు సెంటర్ల నిర్వాహకులకు ఆదేశాలు రావడంతో, వారు తాలు లేని వడ్లను మాత్రమే కాంటా వేస్తున్నారు. వడ్లలో తాలు ఉంటే తుర్పారపట్టి తీసుకురమ్మంటున్నారు. దీనికితోడు కోతలు ప్రారంభమై నెల దాటినా.. పూర్తి స్థాయిలో సెంటర్లను ఓపెన్ చేయకపోవడంతో రైతులు పంటను ప్రైవేట్‌లో అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
తూర్పారపట్టడం అసాధ్యం..
మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వడ్లను తూర్పారపట్టడం సాధ్యమయ్యే పని కాదని రైతులు వాపోతున్నారు. మెషీన్లతో కాకుండా కూలీలతో తూర్పారపట్టాల్సి ఉండడంతో, కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కూలీలను ఏర్పాటు చేసుకున్నా.. ఎండా కాలం కావడంతో కూలీ రేట్లు పెరిగాయి. మహిళా కూలీకి రూ.500, పురుషులకు రూ.700 వరకు ఒక రోజు కూలీ చెల్లించాల్సి ఉంటుంది. ఎకరా పంటను తూర్పారపట్టడానికి దాదాపు ఐదుగురు కూలీలు అవసరం కావడంతో రైతులకు అదనంగా రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనికితోడు గాలులు కూడా సరిగా లేకపోవడంతో తూర్పారపట్టడం కష్టతరంగా మారుతోంది.
అయితే ఎప్పుడు లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకురావడమేమిటని సెంటర్ల నిర్వాహకులను రైతులు ప్రశ్నిస్తున్నారు. నిర్వాహకులు మాత్రం పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, తాలు లేని వడ్లను తెస్తేనే కాంటా వేస్తామని స్పష్టం చేస్తున్నారు. రైతులు మాత్రం మెషీన్‌తో పంటను కోసినప్పుడు తాలు పోతుందని, 5 నుంచి 10 శాతం మాత్రమే తాలు ఉంటుందని చెబుతున్నారు. కానీ, నిర్వాహకులు మాత్రం ఒక్క శాతం తాలు ఉన్నా కొనుగోలు చేయమని సమాధానమిస్తున్నారు.
ప్రైవేట్, కర్నాటక వ్యాపారులకు చేరుతున్న పంట..
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో వడ్ల కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. దీనికితోడు నాలుగు రోజులుగా సాయంత్రం పూట వాతావరణం మారిపోతోంది. అనుకోకుండా వర్షాలు పడుతుండడంతో ఆరబెట్టిన వడ్లు తడిసిపోతున్నాయి. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం క్వింటాల్ వడ్లకు రూ.2,360 మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. కానీ, వర్షాల భయంతో రైతులు ఆరబెట్టిన వడ్లను ప్రైవేట్‌లో క్వింటాల్‌కు రూ.2,400 నుంచి రూ.2,500కు, పచ్చి వడ్లను రూ.2,100 నుంచి రూ.2,250 వరకు అమ్ముతున్నారు.
నారాయణపేట జిల్లాలోని కర్నాటక సరిహద్దులో ఉన్న మండలాల్లో వడ్లను రైతులు ఆ రాష్ట్రంలోని రాయిచూర్ ప్రాంతానికి చెందిన వ్యాపారులకు అమ్ముతున్నారు. ఆ ప్రాంతంలో తెలంగాణ వడ్లకు డిమాండ్ ఉండడంతో వ్యాపారులు పచ్చి వడ్లకే క్వింటాలుకు రూ.2,600 నుంచి రూ.2,700 వరకు చెల్లిస్తున్నారు. అది కూడా నేరుగా పొలం వద్దకు లారీలను తీసుకొచ్చి పంటను తీసుకుపోతుండడంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా మిగులుతుండడంతో వారికి అమ్మేందుకే ప్రయారిటీ ఇస్తున్నారు.
తూర్పారపట్టి తెమ్మంటున్రు..
నాకున్న ఐదున్నర ఎకరాలలో వరి వేసిన. పంట కోసి ఆరబెట్టి అమ్మకానికి ప్రభుత్వ కొనుగోలు సెంటర్‌కు తీసుకెళ్లిన. నిర్వాహకులు వడ్లు తూర్పారపట్టి, చెత్త, తాలు లేకుండా తీసుకొస్తేనే కాంటా వేస్తామని చెబుతున్నరు. ఐదున్నర ఎకరాల వడ్లను తూర్పారబట్టి అమ్మాలంటే కష్టమే. చేసేది లేక పంటను ప్రైవేట్‌లో అమ్మిన. క్వింటాల్‌కు రూ.2,400 చొప్పున ధర పెట్టిన్రు.
రత్నోజి, అమ్మపూర్, చిన్నచింతకుంట మండలం
14 శాతం మాయిశ్చర్ వచ్చినా కొంటలేరు
నాకున్న రెండున్నర ఎకరాల్లో వరి వేసిన. వారం కింద చేను కోసి ఆరబెట్టిన. 14 శాతం మాయిశ్చర్ వచ్చింది. కొనుగోలు సెంటర్‌కు తీసుకుపోతే తూర్పారపట్టి తెమ్మంటున్రు. ప్రైవేటుకు అమ్ముకుందామంటే ధర తక్కువ చెబుతున్నరు. ఇప్పుడేమో వర్షాల భయం పట్టుకుంది.పోగుల దశరథం, అమ్మాపూర్, చిన్నచింతకుంట మండలం
300 సంచులు ప్రైవేట్‌లో అమ్మిన
నాకు ఆరెకరాల భూమి ఉంది. మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని, 12 ఎకరాల్లో వరి వేసిన. 300 సంచులకు పైగా దిగుబడి వచ్చింది. మూడు రోజులుగా ఉన్నట్లుండి వర్షాలు పడుతున్నాయ్. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లో పంట అమ్ముదామంటే పచ్చి వడ్లను కొంటలేరు. చేసేది లేక ప్రైవేట్ వ్యాపారులకే పచ్చి వడ్లను క్వింటాల్‌కు రూ.2,300 చొప్పున అమ్మిన.- దుశెట్టిమహేశ్, మణికొండ, మహబూబ్‌నగర్ రూరల్ మండలం

