అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి

అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి
  • నేలకొరిగిన వరి, మక్క చేన్లు.. తడిసిన వడ్లు, రాలిన మామిడి
  • చాలా చోట్ల కూలిన చెట్లు, ఇండ్లు, కరెంటు స్తంభాలు
  • పిడుగుపాటుతో నలుగురు మృతి
  • మరో నాలుగు రోజులు వర్షా లు: వాతావరణ శాఖ

నెట్‌వర్క్, వెలుగు:అకాల వర్షాలు మరోసారి రైతులను నట్టేట ముంచాయి. చేతికొచ్చిన పంటను నేలపాలు చేశాయి. వడగండ్లు, ఈదురుగాలులతో కురిసిన వానలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కోతకొచ్చిన మక్క, వరి చేన్లు నేలకొరిగిపోగా.. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న వడ్లు తడిసిపోయాయి. వాన నీటిలో కొట్టుకుపోయాయి. పక్వానికొచ్చిన మామిడి కాయలన్నీ రాలిపోయాయి. కొన్ని చోట్ల ఇండ్లు, చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. పిడుగులు పడి నలుగురు చనిపోయారు. మహబూబాబాద్, జగిత్యాల, గద్వాల, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. చాలా చోట్ల పదుల సంఖ్యలో గొర్రెలు చనిపోయాయి.

వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట

మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ, చిన్నగూడురు, నరసింహులపేట, కురవి మండలాల పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం, ఈదురు గాలులతో మొక్కజొన్న, వరి, మామిడి, బొప్పాయి, పెసర పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మరిపెడ మండలంలో 60 వరకు కరెంట్ పోల్స్ విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మొక్కజొన్న పంట కోతకు వచ్చే దశలో నేల వాలింది. వరి చాలా చోట్ల నేలవాలింది. మామిడి కాయలు రాలిపోయాయి. అనేక చోట్ల చెట్లు విరిగిపోయాయి. 21 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నరసింహులపేట మండలం పెద్దనాగారం సమీపంలో మామిడి చెట్లు భారీగా నేల కూలిపోయాయి. తొర్రూరు మండలంలో వరి పైరు నేలకు వాలింది. నాలుగు మండలాల్లో 2,230 ఎకరాల్లో వరి, 825 ఎకరాల్లో మక్క, 3,548 ఎకరాల్లో మామిడి, 290 ఎకరాల్లో పెసర కలిపి మొత్తం 6,901 ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని, 2,700 మంది రైతులు నష్టపోయారని ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. పలు మండలాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం, దామరచర్ల, మద్దుకూరు, తదితర గ్రామాల్లో మామిడికాయలు నేల రాలాయి. లక్షల్లో నష్టపోయామని, నేలరాలిన కాయలను మార్కెట్‌‌‌‌‌‌‌‌లో కొనరని రైతులు వాపోతున్నారు. తిప్పనపల్లిలో ఓ ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి. దీంతో వానకు ఇంట్లోని సరుకులు తడిసి పనికి రాకుండా పోయాయి.

సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూర్ (ఎస్), నేరేడుచర్ల, పెన్ పహాడ్, తుంగతుర్తి, నాగారం, తిరుమలగిరి మద్దిరాల, జాజిరెడ్డి గూడెం, మోతే మండలాల్లో అకాల వర్షానికి, గాలి దుమారానికి వరి, మామిడి పంటలు పాడయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయి. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి శుక్రవారం ఒక్క రోజే 46 వేల బస్తాల ధాన్యాన్ని రైతులు తీసుకొచ్చారు. దాదాపు 5 వేల బస్తాలు కాంటాలు వేయకపోవడంతో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో ఈదురు గాలుల కారణంగా  గోడకూలి కూలింది. దీంతో పిల్లి రాజు యాదవ్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తికి చెందిన 20 గొర్రెలు చనిపోయాయి. 


జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల, మల్యాల, రాయికల్, కోరుట్ల, మేడిపల్లి, భీమారం, మల్లాపూర్ మండలాల్లో వడగండ్ల వర్షం కురిసింది. సుమారు 9 వేల ఎకరాలకు పైగా మామిడి పంటకు నష్టం వాటిల్లింది. 2 వేల ఎకరాల్లో వరి, నువ్వులు, మక్క పంటలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు వర్షానికి తడిసిముద్దయ్యాయి. కామారెడ్డి జిల్లా కామారెడ్డి, రాజంపేట, దోమకొండ, నిజాంసాగర్, ఎల్లారెడ్డి మండలాల్లో వడ్ల గింజలు రాలిపోయాయి. కొన్ని చోట్ల ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి.సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట, కొమురవెల్లి, చేర్యాల మండలం, మెదక్ జిల్లా వెల్దర్తి, శివ్వపేట మండలాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. చాలాచోట్ల రైతులు వరి కోసి ఆరబెట్టుకుంటుండగా.. రాళ్ల వానకు వడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. కొమురవెల్లి మండలంలోనే సుమారు 5 వేల ఎకరాలకు పైగా వరి, 200 ఎకరాల్లో మామిడి పంటలు దెబ్బతిన్నాయి.  

పిడుగుపాటుకు నలుగురు మృతి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బావోజిగూడెం గ్రామానికి చెందిన వుడుగుల శ్రీను (22) శుక్రవారం అర్ధరాత్రి పిడుగుపడి చనిపోయాడు. వెంకంపాడుకు చెందిన ఒక వ్యాపారి చెరువు కట్టపై వడ్లు ఆరబోశాడు. వాన పడడంతో ధాన్యంపై పట్టాలు కప్పడానికి శ్రీనును తీసుకెళ్లాడు. గాలి వాన ఎక్కువ కావడంతో మరో ఇద్దరితో కలిసి ట్రాక్టర్ ట్రాలీ కింద కూర్చున్నారు. ట్రాలీపై పిడుగు పడటంతో శ్రీను చనిపోయాడు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని స ల్కాపురంలో శుక్రవారం అర్ధరాత్రి పిడుగుపడి రైతు హనుమంతు (45) చనిపోయాడు. పొలంలో వడ్ల కుప్పపై కవర్లు కప్పడానికి హనుమంతు, అతని కొడుకు తిమ్మప్ప వెళ్లారు. కవర్లు కప్పుతుండగా పిడుగు పడటంతో హనుమంతు చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంటకు చెందిన మహేందర్ (30) వడ్లు అమ్మడానికి కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు. వర్షం రావడంతో వడ్లపై కవర్​ కప్పేందుకు వెళ్లాడు. అక్కడే పిడుగు పడటంతో మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అస్వస్థతకు గురైయ్యాడు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టుకు చెందిన ముత్యం మల్లేశం గౌడ్ ముంజలు అమ్ముతుండగా పిడుగుపడి చనిపోయాడు. భీమారం మండలంలోని గోవిందరానికి చెందిన గంగనవేని దేవయ్య మేకలను మేపేందుకు వెళ్లగా మేకల సమీపంలో ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో సుమారు 20 మేకలు మృతి చెందాయి. రూ.3 లక్షలకు పైగా నష్టపోయినట్టు దేవయ్య చెప్పారు. కామారెడ్డి జిల్లా రా జంపేట మండలం పొందూర్తితో పిడుగు పడి బాల్​నర్సుకు చెందిన 14 గొర్రెలు చనిపోయాయి.

తగ్గిన టెంపరేచర్లు

రాష్ట్రంలో వాతావరణం కాస్తంత చల్లబడింది. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలతో టెంపరేచర్లు తగ్గాయి. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం అత్యధికంగా జగిత్యాల జిల్లాలోని గోధూరులో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా కీతవారిగూడెంలో 42, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్, జగిత్యాల మల్లాపూర్​లో 41.9, ఆదిలాబాద్​ జిల్లా తలమడుగులో 41.8, మహబూబ్​నగర్​ జిల్లా సాల్కార్​పేటలో 41.7, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, సిద్దిపేట జిల్లా చిట్యాలలో 41.6, నల్గొండ జిల్లా దామరచర్ల, కామారెడ్డి జిల్లా బిక్నూరులో 41.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్​లో అత్యధికంగా జీడిమెట్లలో 39.6 డిగ్రీలు నమోదయ్యాయి. మరోవైపు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 3.6 సెంటీమీటర్ల వర్షం పడింది. అదే జిల్లా రామడుగులో 3.5, చొప్పదండిలో 3.4, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 3.1, జనగామ జిల్లా వడ్లకొండలో 3.1, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో 2.9, మెదక్​లో 2.6, ఆసిఫాబాద్ జిల్లా జంబుగలో 2, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, హనుమకొండ, మహబూబ్​నగర్, సంగారెడ్డి, భూపాలపల్లి, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షం పడింది. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.