
మెదక్/శివ్వంపేట/నిజాంపేట/ పాపన్నపేట, వెలుగు : మెదక్ జిల్లాలో మొత్తం 4,965 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా, విడుతల వారీగా ఇప్పటి వరకు 2,245 ఇండ్ల నిర్మాణం కంప్లీట్ అయ్యింది. ఇందులో పాపన్న పేట, నిజాంపేట్, శివ్వంపేట, మనోహరాబాద్ మండలాల్లో రెండేండ్ల కిందటే దాదాపు 600 ఇండ్లు పూర్తి అయినా వాటిని లబ్ధిదారులకు ఇంకా పంపిణీ చేయడంలేదు. దీంతో అవి పాడుబడుతున్నాయి. అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఫైర్ అవుతున్నారు. ఆ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నిరుపయోగంగా ఉన్న ఇండ్ల పరిస్థితి ఇదీ..
రామాయంపేట మున్సిపల్పరిధిలో 300 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయి రెండేండ్లు కావస్తోంది. కానీ వాటిని అలాట్చేయకపోవడంతో ఇండ్లు పాడుబడుతున్నాయి. రక్షణ లేకపోవడంతో దొంగలు చాలా ఇండ్లలో కరెంట్ వైర్కట్ చేసుకెళ్లారు. ఫలితంగా మళ్లీ లక్షల రూపాయలు ఖర్చుపెడితే తప్ప ఆ ఇండ్లలో కరెంట్ సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో 35 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. అందులో 17 ఇండ్లు పూర్తయ్యాయి. మిగతా ఇండ్లలో కొన్ని పనులు జరగాల్సి ఉంది. అయితే పూర్తయిన ఇండ్లను మూడేండ్లు గడుస్తున్నా ఇంకా ఎవరికీ అలాట్ చేయలేదు. దీంతో ఆ ఇండ్లు గంజాయి సేవించే వారికి, మందుబాబులకు అడ్డాగా మారాయి. పెద్ద మొత్తంలో సిగరేట్ పీకలు, ఖాళీ బీరు బాటిళ్లతో దర్శనమిస్తున్నాయి.
నిజాంపేట మండలంలోని మూడు గ్రామాల్లో 154 ఇండ్ల నిర్మాణం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా వాటిని లబ్ధిదారులకు అలాట్ చేయలేదు. కల్వకుంట గ్రామంలో 74 ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, వాటికోసం 475 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. చల్మెడ గ్రామంలో 40 నిర్మించగా, వాటికోసం 178 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. నందిగామలో 40 డబుల్ బెడ్ రూమ్ లు కంప్లీట్ అయ్యాయి. చల్మెడ, కల్వకుంటలో 2020 సంవత్సరం జూన్ 20న మెదక్ ఆర్డీవో సాయిరాం అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారుల లిస్ట్ ఫైనల్ చేయాలని ఆయా గ్రామాల సర్పంచ్ లకు సూచించారు. కానీ ఇప్పటికీ ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నట్టు ఉంది. ఎవరికీ కేటాయించకపోవడంతో ఇండ్ల తలుపులు, కిటికీలు, పైప్లైన్లు డ్యామేజీ అవుతున్నాయి. పాపన్నపేట మండలం రాంతీర్థంలో 48, బాచారంలో 56 ఇండ్ల నిర్మాణం పూర్తయి మూడేండ్లు అవుతున్నా పంపిణీ చేయడం లేదు. మెయింటెనెన్స్ లేక అవి పాడవుతున్నాయి.
ఖాళీ పెట్టడం సరికాదు..
ఎంతో మంది ఇండ్లు లేనోళ్లు ఉన్నరు. వానకు నానుతూ, ఎండకు ఎండుతూ గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్రు.. అలాంటోళ్లకు వెంటనే నిరుపయోగంగా ఉన్న డబుల్బెడ్రూం ఇండ్లను ఇయ్యాలె. ఇండ్ల పనులన్నీ అయిపోయినా ఖాళీగా పెట్టడం సరికాదు.
- మురళి, దొంతి గ్రామం, శివ్వంపేట మండలం