తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది: హరీశ్‌రావు

తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది: హరీశ్‌రావు

తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా తుప్రాన్‌ మండలం వెంకటాయపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో హరీష్ పాల్గొన్నారు.  కాంగ్రెస్‌ చెప్పింది కొండంత.. చేస్తుంది గోరంతని విమర్శించారు. ఎన్నికల టైమ్ లో ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైందని  కాంగ్రెస్‌ ను హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను లేకుండా చేయాలనుకుంటున్నాయని.. కానీ తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని వెల్లడించారు.  

అంతకుముందు చిన్నకోడూర్ మండలంలోని పెద్ద కోడూర్, చంద్లపూర్ గ్రామాల్లో ఉచితంగా కుట్టు శిక్షణ పొందిన 300 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు హరీష్ రావు.  మహిళలు ఆర్థికంగా ఎదిగి, తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే తన తపన అని తెలిపారు.   సిద్దిపేట నియోజకవర్గంలో 2200 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి, ఒక్కొక్కరికి 10 వేలు విలువ గల మిషన్లను అందించామని చెప్పుకొచ్చారు.

 నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు హరీష్ . కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నింపుకున్న చెరువుల నుంచి రాజకీయ కారణాలతో నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. సిద్దిపేట ప్రజల సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని హరీష్ హామీ ఇచ్చారు.