
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి నంద్ గోపాల్ నంది కుమారుడు అభిషేక్ గుప్తా, కోడలు కనిష్కకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ఘటన తిర్వా ప్రాంతంలో లక్నో--ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై 194 కిలోమీటర్ల వద్ద జరిగింది. ప్రమాద సమయంలో కారు భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వాహనం నుంచి ఎడమవైపు టైరు పూర్తిగా విడిపోయింది. ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని ఇద్దరినీ కారులో నుంచి బయటకు తీశారు. అభిషేక్ గుప్తా పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. వర్షం కారణంగా రోడ్డు కాస్త జారిపోయిందని, అయితే ఈ రోడ్డు ప్రమాదానికి కారణమేమిటో చెప్పలేమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అభిషేక్, కనిష్కల వివాహం ఈ నెల జూలై 11న జరిగింది. వధూవరులను ఆశీర్వదించేందుకు యోగి ఆదిత్యనాథ్ స్వయంగా వెళ్లారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
నంద్ గోపాల్ నంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో పారిశ్రామిక అభివృద్ధి మంత్రి. ఆయన గతంలో ఒక బాంబు దాడికి గురయ్యారు. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.