మసీదు కోనేరులో శివలింగం

మసీదు కోనేరులో శివలింగం

వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్​లోని కోనేరులో శివలింగాన్ని గుర్తించారు. స్థానిక కోర్టు ఆదేశాల మేరకు మసీదు కాంప్లెక్స్​లో చేపట్టిన వీడియోగ్రఫీలో దీనిని అధికారులు కనుగొన్నారు. సాధారణంగా మసీదుకు వచ్చే జనాలు నమాజ్​ చేయడానికి ముందు చేతులు కడిగే వాజుఖానాలో దీనిని గుర్తించారు. శివలింగాన్ని గుర్తించిన ప్రదేశాన్ని సీజ్​ చేయాలని వారణాసి జిల్లా అధికారులను స్థానిక కోర్టు ఆదేశించింది. సీల్​ చేసిన ఏరియాలో భద్రతా ఏర్పాట్లు చేయాలని వారణాసి జిల్లా కలెక్టర్, పోలిస్​ కమిషనర్, సీఆర్పీఎఫ్​ కమాండెంట్​లను సివిల్​ జడ్జి(సీనియర్ డివిజన్) రవి కుమార్​ దివాకర్ సూచించారు. ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదులో ఉన్న హిందూ దేవుళ్లకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కొందరు మహిళలు స్థానిక కోర్టును ఆశ్రయించారు.

వీడియోగ్రఫీ సర్వే పూర్తి

జ్ఞానవాపి మసీదులో చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే మూడోరోజైన సోమవారం పూర్తయ్యింది. ఉదయం 8 గంటలకు మసీదు కాంప్లెక్స్​లో వీడియోగ్రఫీ సర్వే మొదలైంది. 10.15 నిమిషాలకు అది ముగిసింది. కోర్టు ఏర్పాటు చేసిన కమిషన్​ తన సర్వేను పూర్తి చేసిందని, కమిషన్​ పనితీరుతో అన్ని వర్గాలు సంతృప్తి చెందాయని వారణాసి కలెక్టర్ కౌశల్​ రాజ్​ శర్మ చెప్పారు. కాంప్లెక్స్​లోని వాజూఖానా ప్రాంతంలో సర్వే బృందం శివలింగాన్ని గుర్తించిందని హిందువుల తరపున కోర్టులో వాదనలు వినిపిస్తున్న అడ్వొకేట్​ మదన్​మోహన్​ యాదవ్​ చెప్పారు. శివలింగాన్ని కాపాడాలని కోరుతూ సివిల్​ జడ్జి కోర్టులో పిటిషన్​ దాఖలు చేసినట్టు తెలిపారు. మసీదులోని హిందూ దేవుళ్లకు పూజలు చేసే విషయమై కోర్టు ఏ ఆదేశాలు ఇస్తుందనే విషయం మంగళవారం తెలుస్తుందని ఆయన చెప్పారు. కోర్టు అపాయింట్​ చేసిన ముగ్గురు అడ్వొకేట్​ కమిషనర్లు, ఇరు పక్షాల నుంచి ఐదుగురు చొప్పున లాయర్లు, వీడియోగ్రఫీ టీమ్​సభ్యులు ఈ సర్వేలో పాల్గొన్నారు.