యూపీలో దారుణం: డీజిల్ కోసం శవంతో 2 గంటలు క్యూలో వ్యాన్.. చివరికి 'NO' స్టాక్ బోర్డ్

యూపీలో దారుణం: డీజిల్ కోసం శవంతో 2 గంటలు క్యూలో వ్యాన్.. చివరికి 'NO' స్టాక్ బోర్డ్

చనిపోయిన మనిషికి ఇచ్చే కనీస గౌరవం కూడా కరువవుతున్న రోజులివి. ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్‌లో జరిగిన ఒక ఘటన సభ్యసమాజాన్ని తలవంచుకునేలా చేస్తోంది. పార్థివ దేహాన్ని మోసుకెళ్తున్న వాహనానికి డీజిల్ కోసం ఏకంగా 2 గంటల పాటు వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ రోజుల్లో చనిపోయిన వారు కూడా క్యూ లైన్లో నిలబడాల్సిన దుస్థితి వచ్చిందంటూ ఒక సామాన్యుడు ఆవేదనతో అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.

మహారాజ్‌గంజ్‌లోని నిచ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధవే గ్రామానికి చెందిన సర్వేష్ కసౌధన్ బుధవారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఒక పికప్ వాహనంలో తరలిస్తున్నారు. అయితే మార్గమధ్యలో నిచ్లాల్-చియుతహాన్ రోడ్డుపై వాహనంలో డీజిల్ అయిపోయింది. దీంతో డీజిల్ కొట్టించడానికి సమీపంలోని ఒక పెట్రోల్ పంపు వద్ద వాహనాన్ని నిలిపివేశారు. ఆ సమయంలో వాహనంలో పార్థివ దేహం అలాగే ఉంచాల్సి వచ్చింది.

వాహనం క్యూలో ఉండి దాదాపు 2 గంటలు గడుస్తున్నా.. పంపు సిబ్బంది కనికరించలేదు. మృతదేహం ఉందని తెలిసినా ప్రాధాన్యత ఇవ్వకపోగా.. చివరకు ఇంధనం స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టి పంప్‌ను మూసివేశారు. లోపల చనిపోయిన వ్యక్తి పార్థివదేహం పెట్టుకుని రెండు గంటల పాటు డీజిల్ కోసం వేచి చూసినా ఫలితం లేకపోవడంతో మృతుడి బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల తలెత్తుతున్న ఇంధన కొరత పరిస్థితులకు ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ హృదయవిదారక దృశ్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో అధికారులు మేల్కొన్నారు. దీనిపై నిచ్లాల్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సిద్ధార్థ్ గుప్త స్పందిస్తూ.. పెట్రోల్ పంప్ ఆపరేటర్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సదరు పెట్రోల్ బంక్ యజమానికి నోటీసులు జారీ చేస్తామని, అవసరమైతే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. మానవత్వం మరిచి ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.