
- ఇండియాలో మొత్తం కాలేజీలు 41,600
- సర్కారు కాలేజీల సంఖ్య 8,903
- మొత్తం కాలేజీల్లో ప్రైవేటువి 78 శాతం
- 7వ ప్లేస్ లో ఏపీ.. 9వ స్థానంలో తెలంగాణ
న్యూఢిల్లీ: మన దేశంలో మొత్తం 41,600 కాలేజీ లు ఉన్నాయి. ఇందులో 8,903(21.4%) గవర్న మెంట్ కాలేజీలు కాగా.. 5,658 (13.3%) ప్రైవేట్(ఎయిడెడ్), 27,039(65%) ప్రైవేట్(అన్ ఎయిడెడ్) కాలేజీలు ఉన్నాయి. దేశంలోనే ఎక్కువ కాలేజీలు ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్నాటక ఉన్నాయి. కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన ది ఆలిండియా సర్వే ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్(ఏఐఎస్హెచ్ఈ) 2020–21 రిపోర్ట్‌లో ఈ విషయం వెల్లడైంది. కాలేజీల సంఖ్య ఆధారంగా దేశంలోని టాప్ టెన్ రాష్ట్రాల్లో యూపీ, మహారాష్ట్ర, కర్నాటకతో పాటు రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, కేరళ ఉన్నాయి. వీటిలో ఒక లక్ష మంది జనాభాకు కనీసం 29 కాలేజీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 8,114 కాలేజీలు ఉన్నాయి. ప్రతి లక్ష మంది జనాభాకు 32 కాలేజీలు అక్కడ ఉన్నాయి. మహారాష్ట్రలో 4,532 కాలేజీలు ఉంటే.. ప్రతి లక్ష మందికి 34 కాలేజీలు ఉన్నాయి. కర్నాటకలో 4,233 కాలేజీలు ఉంటే.. ప్రతి లక్ష మందికి 62 కాలేజీలు ఉన్నాయి. రాజస్థాన్ లో 3,694 కాలేజీలు ఉండగా.. లక్ష మందికి 40 కాలేజీలు ఉన్నాయి. తమిళనాడులో 2,667 కాలేజీలు ఉంటే.. లక్ష మందికి 40 కాలేజీలు ఉన్నాయి. ఏపీలో 2,601 కాలేజీలు ఉంటే.. ప్రతి లక్ష మందికి 49 కాలేజీలు ఉన్నాయి.
ఎక్కువ శాతం అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీలే
ఈ కాలేజీల్లో ఎక్కువ శాతం అండర్ గ్రాడ్యుయేట్ లెవల్ ప్రోగ్రామ్‌లనే అందిస్తున్నాయి. 2.9 శాతం కాలేజీలు మాత్రమే పీహెచ్డీ లెవల్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తుండగా.. 55.2 శాతం కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవల్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. 35.8 శాతం కాలేజీలు ఒక్క కోర్సునే అందిస్తుండగా.. ఇందులో 82.2 శాతం కాలేజీలు ప్రైవేటు మేనేజ్మెంట్లో ఉన్నవే.