
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం (జూలై 19) తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఎకో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకు సహా ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం ఉదయం నోయిడా నుండి ఆగ్రాకు ఒక ఎకో కారు వెళుతుండగా..యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై ఎకో కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ఇద్దరు కుమారులు సహా ఆరుగురు చనిపోయారు. మృతులు ఆగ్రాలోని బససి పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్లాల్ పూర్ గ్రామస్తులుగా గుర్తించారు.
శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మధుర లోని బల్దేవ్ లోని సారాయ్ సల్వాన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.