పాన్, గుట్కాలు పంపిస్తరా?

పాన్, గుట్కాలు పంపిస్తరా?
  • రసగుల్లాలు, సమోసాలు అర్జెంట్ ప్లీజ్
    యూపీలో హెల్ప్ లైన్ నంబర్లకు జనం వింత కోర్కెలు

లక్నో: ‘రసగుల్లాలు ఉన్నాయా?, సమోసాలు దొరుకతాయా?, పాన్, గుట్కా పంపిస్తారా?’ ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లకు వస్తున్న రిక్వెస్టులు ఇవి. లాక్ డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి వింత డిమాండ్లు పెడుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం హెల్ప్ లైన్ నంబర్ 1076కు ఎక్కువగా మెడిసిన్, రేషన్ తోపాటు ఇతర నిత్యావసరాల కోసం కాల్ చేస్తున్నారని, ఎప్పటికప్పుడు వాటిని అందిస్తున్నట్లు చెప్పారు. సీఎం హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన లక్ష మందికి సాయం అందించినట్లు తెలిపారు. పోలీసు హెల్ప్ లైన్ నంబర్ 112కు ఫోన్ చేసి జనం వింత కోర్కెలు చెబుతున్నారని సిబ్బంది చెప్పారు. ఒక వ్యక్తి ఫోన్ చేసి తనకు అర్జెంట్ గా రసగుల్లాలు కావాలని అడిగాడని, ఒక వలంటీర్ ద్వారా రసగుల్లాలు ఇంటికి పంపామన్నారు. ఫోన్ చేసిన వ్యక్తి 80 ఏళ్ల డయాబెటిక్ పేషెంట్ అని షుగర్ లెవెల్స్ పడిపోవడం రసగుల్లాలు అడిగినట్లు తర్వాత తెలిసిందన్నారు. మరికొంత మంది ఫోన్ చేసి పాన్, గుట్కా, వేడి వేడి సమోసాలు కావాలని అడుగుతున్నారని పోలీసులు చెప్పారు. సమోసాలు అడిగినవారికి పంపిస్తున్నామని, బిల్లు మాత్రమే వాళ్లే కట్టాల్సి ఉంటుందన్నారు. కొందరు పిజ్జాలు, లిక్కర్ కూడా అడుగుతున్నారని సిబ్బంది చెప్పారు. కొందరు చిన్నపిల్లలు ఫోన్ చేసి చిప్స్, కేక్స్, ఐస్ క్రీమ్ లు, పిజ్జాలు అడుగుతున్నారన్నారు. హెల్ప్ లైన్ సేవలపై ఉత్తరప్రదేశ్ ఏడీజీపీ అసిమ్ అరుణ్ మిశ్రా మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పోలీసు సిబ్బంది కొత్త పాత్ర పోషిస్తున్నారని అన్నారు. లాక్ డౌన్ మొదలైనప్పట్నుంచి35 వేల పోలీస్ రెస్పాన్స్ వెహికల్స్ ద్వారా పోలీసులు నిరంతరం సేవలు అందిస్తున్నారని తెలిపారు. 1,100 మంది పోలీసులు హెల్ప్ లైన్ సెంటర్లలో పని చేస్తున్నారని చెప్పారు.