వడ్డీ లేకుండా కోటి మంది మహిళలకు రూ.లక్ష లోన్.. యూపీ సర్కార్ సంచలన స్కీమ్!

వడ్డీ లేకుండా కోటి మంది మహిళలకు రూ.లక్ష లోన్.. యూపీ సర్కార్ సంచలన స్కీమ్!

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా మరో అడుగు వేసింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లతో సుమారు కోటి మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా వడ్డీ లేని లోన్స్ అందించే స్కీమ్‌కి శ్రీకారం చుట్టింది. 'ఉత్తరప్రదేశ్ మహిళా ఉద్యమి క్రెడిట్ యోజన' పేరుతో ఈ సరికొత్త పథకాన్ని తీసుకురానున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా 2026-27 బడ్జెట్‌లో స్కీమ్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ స్టేట్ రూరల్ లైవ్‌హుడ్ మిషన్ పరిధిలోని మహిళలకు ఈ ప్రయోజనం నేరుగా అందనుంది.

ఈ స్కీమ్ కింద అర్హులైన మహిళలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులను అందజేయనున్నారు. దీని ద్వారా వారు చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి, ఇప్పటికే ఉన్న ఉపాధిని విస్తరించుకోవడానికి వీలవుతుంది. ఈ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం 3 విడతలుగా అందజేయనుంది. తొలి విడతలో రూ. 20వేలు అందిస్తారు. ఈ మొత్తాన్ని సమయానికి తిరిగి చెల్లించిన మహిళలు రెండో విడత కింద రూ. 30వేలు పొందడానికి అర్హులవుతారు. దీనిని కూడా విజయవంతంగా చెల్లించిన తర్వాత మూడో విడతలో రూ.50వేలు అందజేస్తారు. ఇలా విడతలవారీగా మొత్తం రూ. లక్ష వరకు వడ్డీ లేని రుణం లభిస్తుంది.

ఈ ప్రణాళికపై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య యోజనా భవన్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బ్యాంకులు కూడా దీనికి సంబంధించిన ప్రాథమిక విధివిధానాలను రూపొందించాయి. కేవలం రుణాలకే పరిమితం కాకుండా, మహిళల డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. క్యూఆర్-కోడ్ ఫీచర్లతో కూడిన డిజిటల్ ఐడీ కార్డ్‌లు, ఈ-కామర్స్, ఆన్‌లైన్ మార్కెటింగ్ సేవలతో మహిళలను అనుసంధానించాలని నిర్ణయించారు.

ALSO READ : ఐఫోన్ లవర్స్‌కి షాక్: ఇండియాలో రేట్లు భారీగా పెంచేసిన ఆపిల్..

సాంప్రదాయ స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల నుంచి మహిళలను బయటకు తీసుకువచ్చి, స్థిరమైన మైక్రో-ఎంటర్‌ప్రైజెస్‌ను నిర్మించడమే ఈ స్కీమ్ అసలు ఉద్దేశం. ఇందులో భాగంగానే ఈ-రిక్షా కొనుగోలుకు రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడం, రాష్ట్రంలో 100 'మహిళా శక్తి కేంద్రాలు' ఏర్పాటు చేయడంపై కూడా కసరత్తు చేస్తోంది యోగి సర్కార్.