స్టేషన్‌లో యువకుడి మృతి.. ఐదుగురు పోలీసుల సస్పెన్షన్

V6 Velugu Posted on Nov 10, 2021

  • టాయిలెట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడంటున్న పోలీసులు
  • పోలీసుల హత్య అని బాధితుడి తండ్రి ఆరోపణ

ఎటా: ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలోని పోలీస్‌ స్టేషన్‌లో ఓ యువకుడి మృతి ఘటన కలకలం రేపుతోంది. పోలీసులేమో అతడు టాయిలెట్‌కు అని చెప్పి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుంటే.. ఆ యువకుడి కుటుంబసభ్యులు మాత్రం పోలీసులే ఉరేసి చంపి డ్రామాలాడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పోలీస్‌ స్టేషన్‌లో ఒక నిందితుడు మరణించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ స్టేషన్‌కు సంబంధించిన ఐదుగురు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు.

ఎటా జిల్లాలోని కాస్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో గత వారం ఓ కిడ్నాప్‌ కేసు ఫైల్ అయింది. ఓ యువతిని కొంత మందికి కలిసి కిడ్నాప్‌ చేసి, ఆమెకు బలవంతంగా పెండ్లి చేశారని కంప్లైంట్ వచ్చింది. దీనిపై ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు.. అల్తాఫ్ అనే 22 ఏండ్ల యువకుడిని అతడి ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో ప్రశ్నించేందుకు మంగళవారం ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ వ్యక్తి అదే రోజు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారి ప్రమోద్‌ బోత్రే వివరణ ఇచ్చారు. ఆ యువకుడిని ప్రశ్నిస్తుండగా టాయిలెట్‌కు అని చెప్పి లోపలికి వెళ్లాడని, ఎంతసేపటికీ రాకపోవడంతో స్టేషన్‌ సిబ్బందికి లోపలికి వెళ్లి చూడగా అతడు వేసుకుని ఉన్న బ్లాక్ జాకెట్‌తో ఉరి వేసుకుని చలనం లేకుండా పడి ఉన్నాడని చెప్పారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారని, అయినప్పటికీ ఐదు పది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. అయితే స్టేషన్‌లో ఇటువంటి ఘటన జరగడం పోలీసులు నిర్లక్ష్యం కిందకే వస్తుందని, అందుకే ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేశామని ప్రమోద్ చెప్పారు. కాగా, ప్రాణాలు కోల్పోయిన యువకుడి తండ్రి చాంద్ మియాన్‌ మాత్రం తన కొడుకుది ఆత్మహత్య కాదని, పోలీసుల హత్య అని ఆరోపిస్తున్నాడు. తన కొడుకు అల్తాఫ్‌ను పోలీసులకు అప్పగిస్తే.. వాళ్లు ఉరేసి చంపేశారని అన్నాడు.

మరిన్ని వార్తల కోసం..

భారత సంప్రదాయంలో రష్యన్ జంట పెళ్లి

ఇండో-, పాక్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ను16.7 కోట్ల మంది చూసిన్రు

జై భీమ్​లో టీచరమ్మ కథ

Tagged police station, UP, family, suicide

Latest Videos

Subscribe Now

More News