జై భీమ్​లో టీచరమ్మ కథ

జై భీమ్​లో టీచరమ్మ కథ

‘జై భీమ్​’ సినిమాలో టీచర్​ మిత్ర పేదల  గుడిసెలకు వచ్చి చదువులు చెబుతుంది. వాళ్ల గుడిసెల దగ్గరకి వెళ్లడానికి  మోపెడ్​ను వాడుతుందామె. పిల్లలకు, పెద్దలకు అక్షరాలు నేర్పుతుంది. మిత్ర క్యారెక్టర్​కు  తమిళనాడులోని ‘అరివోలి ఇయక్కమ్​’  ఉద్యమం​ ఆధారం. దాన్ని నడిపింది  టీచర్​ 
ఎన్​. కన్నమ్మాళ్‌‌. ఆమె​ నిజజీవితంలో చేసిన కృషే.. జై భీమ్​ సినిమాలోని టీచర్​ మిత్ర పాత్ర.

తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా ఎన్. కన్నమ్మాళ్‌‌ ​ది. 1981  లెక్కల ప్రకారం తమిళనాడులో అఆలు వచ్చినవాళ్లు 54 శాతం.  అందులో పుదుకొట్టై జిల్లా లిటరసీలో చివరిస్థానంలో ఉంది.  ఈ పరిస్థితిని చూసి చలించిపోయింది కన్నమ్మాళ్​.  ఆమెకు అప్పుడు 24 ఏళ్లు. డిగ్రీలో సైన్స్​ చదివింది. ఆ తర్వాత ఎల్​ఐసీ ఉద్యోగంలో చేరింది. ఎల్​ఐసీ అసిస్టెంట్​ ఉద్యోగం చేస్తున్నప్పుడు సొంత జిల్లాలో  లిటరసీ పర్సెంట్​చూసి ఆమెకు బాధగా అనిపించింది. అందులో 70శాతం మహిళలకు అసలు చదువు లేదు. ముఖ్యంగా అక్షరం ముక్కరాని వాళ్లంతా 8 నుంచి 45 ఏండ్ల లోపు  వాళ్లే. ఈ పరిస్థితుల్లో ఆమె చొరవ తీసుకుంది.  పిల్లలకు, పెద్దవాళ్లకు, ముఖ్యంగా మహిళలకు చదువుతోపాటు వివిధ రకాల స్కిల్స్​ నేర్పించాలి అనుకుంది. ఎల్​ఐసీలో ఉద్యోగం చేస్తూనే  ఉదయం, రాత్రిపూటల్లో జిల్లాలోని గిరిజన,  ఇతర కమ్యూనిటీలు ఉన్న ఊళ్లకు వెళ్లేది.  పిల్లలకు అక్షరాలు నేర్పేది. చదువు ఇంపార్టెన్స్​, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించేది. చిన్నగా మొదలైన ఈ ప్రయత్నానికి తెలిసిన వారి నుంచి, కొలీగ్స్​ నుంచి మంచి సాయం అందింది. కన్నమ్మాళ్‌‌ ​కు సాయంగా స్నేహితులు వచ్చారు.   

‘అరివోలి ఆయక్కమ్​’ ( లైటింగ్​ ఆఫ్​ నాలెడ్జ్​) ను ఒక ఉద్యమంగా అన్ని ఊళ్లకు తీసుకెళ్లారు. గ్రౌండ్​ లెవెల్​ పరిస్థితులను చూసిన కన్నమ్మాళ్‌‌ ​కు ఊళ్లలో మహిళల పరిస్థితి అర్థమైంది. వాళ్లు బయటకు రావాలన్నా, ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా, కొత్త పనులు నేర్చుకోవాలన్నా రకరకాల అవస్థలు ఉండేవి. దీంతో  కన్నమ్మాళ్‌‌ ​ మహిళకు చదువుతో పాటు  స్కిల్స్​ను కూడా నేర్పించి, భయాన్ని పొగొట్టాలి అనుకుంది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘ సైక్లింగ్​ మూవ్​మెంట్​’ మహిళలకు చదువుతో పాటు ‘సైకిల్​ తొక్కడం’ నేర్పించడాన్ని ఉద్యమంలా నడిపింది. 

సైక్లింగ్​ మూవ్​మెంట్​ పుద్దుకొట్టై జిల్లాలో  అన్ని ఊళ్లలో స్టార్ట్​ అయింది. స్పాన్సర్స్​, విరాళాల ద్వారా ‘లేడీస్​ సైకిల్స్​’ కొని మహిళలకు అందించారు. 1992  మార్చ్​ 8న పుదుకొట్టై జిల్లా అంతా మహిళల సైకిళ్ల బెల్స్​తో మార్మోగింది. సుమారు 70వేల మంది  మహిళలు, బాలికలు జిల్లాలో సైకిల్​ తొక్కుతూ, గంటలు మోగిస్తూ ర్యాలీ చేశారు. ఎంతో మంది మహిళలు ఆ రోజు ఒక సైకిల్​ కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ర్యాలీ మహిళల అభివృద్ధికి తోడ్పడింది. వారిలో నమ్మకం, కొత్తవి నేర్చుకోవాలన్న గుణంతో పాటు బయటకు రావడానికి అవకాశం దక్కింది.  సైకిళ్లపై ఊరి ప్రయాణాలు చేయడం,  సరుకులు తీసుకొని రావడం, నీళ్లు మోసుకురావడం ఈజీ అయింది.  మహిళల ఉత్సాహాన్ని, ఉద్యమ తీరును చూసిన ‘యునిసెఫ్​’ అరివోలి ఉద్యమ కార్యకర్తలకు 50 మోపెడ్లు అందించింది.  తర్వాత రోజుల్లో అక్కడ మహిళలు చదువు, సైకిల్​ నేర్చుకోవడం జీవితంలో భాగమైంది.  ఆ టైంలో లేడీస్​ సైకిళ్లకు పెట్టింది పేరైన ‘రామ్​ సైకిల్స్​’ అమ్మకాలు 350 శాతం పెరిగాయి.  1993లో  అరివోలి అయక్కమ్​  మూవ్​మెంట్​ను ప్రభుత్వం అఫీషియల్​గా అనౌన్స్​ చేసింది. ఆ  జిల్లా కలెక్టర్​ శీలా రాణి  సైక్లింగ్​ మూవ్​మెంట్​ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. కన్నమ్మాళ్‌‌ ​ను సెంట్రల్​ కో–ఆర్డినేటర్​గా నియమించింది. దాంతో చదువుల ఉద్యమం మరింత ముందుకు సాగింది. 

మహిళలకు సైకిల్​ తొక్కడం వచ్చాక..

చదువుతో పాటు మహిళలకు సైకిల్​ తొక్కడం వచ్చాక మహిళ జీవితంలో మార్పులు మొదలయ్యాయి. బస్సుల కోసం ఎదురు
 చూడడం,  చిన్న చిన్న పనుల కోసం తండ్రి, కొడుకు,  అన్నల మీద ఆధారపడే వారు కాస్తా  సొంతంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్లగలిగారు. 

విమానం నడిపినట్టు..

‘మహిళకు చదువు రావడం, వాళ్లు సైకిల్​, మోపెడ్లు నడపడం మాకు కొండంత విజయం.  ఇంటికే పరిమితం అయ్యే రూరల్​ మహిళలు సైకిల్​ తొక్కుతూ సొంత పనులు చేసుకోవడం అంటే విమానం  నడిపినంత ఆనందంగా అనిపించింది. మహిళలు సైకిల్​ తొక్కడం ఏంటి అని కొందరు నవ్వొచ్చు. కానీ, అది ఎంత అవసరమో మాకు మాత్రమే తెలుసు.

- ఎన్​. కన్నమ్మాళ్‌‌

లిటరసీ పై యుద్ధం...

1981 వరకు ఏటా లిటరసీలో చివరి స్థానంలో ఉన్న పుదు కొట్టై జిల్లా అరివోలి ఉద్యమంతో మారింది.  1991 నాటికి కన్నమ్మాళ్‌‌ ​ తో సుమారు 30 వేల మంది వాలంటీర్లుగా చేరారు. వీళ్లంతా టీచర్లుగా మారి  గిరిజనుల గూడాలకు వెళ్లేవారు. పిల్లలకు, పెద్దవాళ్లకు చదువు, స్కిల్స్​ నేర్పించేవారు. ఉదయం 11గంటల లోపే  ఊళ్లలో ఈ లిటరసీ తరగతులు ముగించి, మళ్లీ రాత్రి 7 తర్వాత మొదలు పెట్టేవారు. పదేళ్లలో 2లక్షల 40 వేల మందికి చదువులు చెప్పారు. 1992లో తమిళనాడు ప్రభుత్వం పుదుకొట్టై జిల్లాను పూర్తి లిటరసీ జిల్లాగా ప్రకటించింది.