
పెళ్లై 48 గంటలు కాలేదు.. కాలికి పారాని ఆరలేదు.. ఇంతలోనే నవ వధువుకి గట్టి షాక్ తగిలింది. అత్తమామలు ఇంటి నుంచి గెంటేసి బయటకు పొమ్మన్నారు.. ఇంతకు ఎందుకంటే.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో వింత ఉదంతం వెలుగుచూసింది. సంఘం పంచాయితీలో నివాసం ఉంటున్న ఓ కుటుంబ సభ్యులకు ఒక కూతురు ఉంది. ఆమె పెళ్లీడుకు రావడంతోపెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టాడు తండ్రి.
రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కుటుంబంతో పెళ్లి ఫిక్సయ్యింది. వధూవరులు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలు ఇద్దరికి పెళ్లి కూడా చేశారు. ఇంతలోనే ఓ ట్విస్ట్ నెలకొంది. అమ్మాయి సరిగ్గా నడవటం లేదని అత్తామామ ఇంటి నుంచి గెంటేశారు. దీంతో అమ్మాయి ఏడుస్తూ పుట్టింటికి వచ్చి జరిగిందంతా వివరించింది. వధువు తాత నవరాలు ఇంటికి తిరిగి వచ్చి జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించడంతో దిగ్భ్రంతికి గురై మరణించాడు. అత్తమామలపై వధువు తరపు వాళ్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వరుడి తండ్రి ఆమె వికలాంగురాలని చెప్పడంతో వధువు తండ్రి తన కుమార్తెకు నడవడానికి ఇబ్బంది లేదని వాదించాడు. అమ్మాయి తప్పు లేదని, అత్తమామలు ఉద్దేశపూర్వకంగానే వధువును అంగీకరించడం లేదని బాలిక కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వరుడి కుటుంబం వివాహం పట్ల సంతోషంగా లేరని, అందుకే వికలాంగుల కారణాన్ని చెప్పి సంబంధాన్ని ముగించాలని చూస్తున్నారని వధువు కుటుంబం చెబుతుంది.