యూపీలో ఇళ్ల కూల్చివేత.. తల్లీ బిడ్డ సజీవదహనం

యూపీలో ఇళ్ల కూల్చివేత.. తల్లీ బిడ్డ సజీవదహనం

ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో దారుణం జరిగింది. మదౌలి గ్రామంలో ఇళ్ల కూల్చివేతల సమయంలో ప్రమీల దీక్షిత్, ఆమె కూతురు సజీవ దహనమయ్యారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న నివాసాల‌ను అధికారులు బుల్డోజ‌ర్లతో కూల్చేశారు. అయితే ఓ గుడిసెకు నిప్పు అంటుకోవ‌డంతో.. అందులో ఉన్న త‌ల్లీబిడ్డ స‌జీవద‌హ‌నం అయ్యారు. మహిళలు గుడిసెలో ఉండగా నిప్పంటించారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. అయితే తల్లీబిడ్డలే నిప్పంటించుకున్నారని పోలీసులు చెప్పారు. తాము వారిని కాపాడేందుకు ప్రయత్నించామని.. ఈ ప్రయత్నంలో ప్రమీల భర్త సహా స్టేషన్ హౌస్ ఆఫీసర్ దినేష్ గౌతమ్కు గాయాలయ్యాయని చెప్పారు. అయితే, తల్లీబిడ్డల మరణానికి ఎవరైనా కారణం అని తెలిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న సమయంలో వీడియో తీశారని.. ఆ వీడియోను పరిశీలిస్తామని చెప్పారు. యూపీలో హత్యలకు యోగి పరిపాలనే కారణమని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది.బ్రాహ్మణులు కూడా యోగి ప్రభుత్వ దౌర్జన్యాలకు గురి అవుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ ట్వీట్ చేసింది.