దేశీయ టెక్ దిగ్గజ సంస్థ జోహో సీఈఓ శ్రీధర్ వెంబు తాజాగా ఉపాసన కొణిదెల పోస్టుకు రిప్లై ఇస్తూ.. వివాహం, కుటుంబ పరంపరలపై వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీశాయి. ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల చేసిన వ్యాఖ్యలకు ఆయన ఇచ్చిన ప్రతిస్పందన ప్రస్తుతం నెటిజన్ల మధ్య చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ఉపాసన ఐఐటీ హైదరాబాద్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆర్థిక స్వాతంత్ర్యం జీవితంలో ఎంత ముఖ్యమో విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. మహిళలు ముందుగా కెరీర్‌పై దృష్టి పెట్టడం మంచిదని, అవసరమైతే తమ అండాలను egg freezing టెక్నిక్ ద్వారా భవిష్యత్తులో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవచ్చని సూచించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో పలువురు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
ఈ క్రమంలో జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ఎక్స్‌లో ఉపాసన పోస్టుకు స్పందనగా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. నేటి తరం యువత 20ల్లోనే వివాహం చేసుకుని ఫ్యామిలీ ప్రారంభించుకోవాలని.. దాన్ని ఆలస్యం చేయకూడదని సూచించారు. తాను చాలా మంది పురుష, స్త్రీ వ్యాపారవేత్తలతో మాట్లాడినప్పుడు కూడా వారికి ఇదే సూచిస్తున్నట్లు చెప్పారు శ్రీధర్ వెంబు. అయితే తన మాటలు పాతకాలపు సలహా అనిపించవచ్చు కానీ భవిష్యత్తులో ఇదే సరైన దారి అవుతుందని అన్నారు. సమాజానికి, పూర్వీకులకు మన జనరేషన్ తమ జనాభా బాధ్యతను గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
ALSO READ : ప్రపంచంలోనే ధనవంతుడు..
అయితే శ్రీధర్ వెంబు వ్యాఖ్యలతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తూ కుటుంబం ఒక బలమైన ఆధారం అని చెబుతుండగా.. మరికొందరు ప్రస్తుత ఆర్థిక స్థితిలో పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ బాధ్యతలు తీసుకోవడం కష్టమని వాదిస్తున్నారు. ఫ్యామిలీ డిస్ట్రాక్షన్ కాదని.. అది ఒక యాంకర్ లాంటిదని ఒక యూజర్ కామెంట్ చేశారు. స్థిరమైన భావోద్వేగ బలం ఉన్నప్పుడు స్టార్టప్ ప్రయాణం సులభమౌతుందన్నారు. ఎవరూ యువతకు నిజమైన వాస్తవాలను చెప్పడం లేదని.. తక్కువ జీతాలు, అద్దెల ఒత్తిడి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం అసలైన సమస్యలుగా ఉన్నాయని అన్నారు.
మరికొందరు మేకింగ్ ఫ్యామిలీ అనేది పూర్తిగా వ్యక్తిగతమైన అంశంగా కామెంట్ చేశారు. ఇలా ఉపాసన కొణిదెల శ్రీధర్ వెంకు మధ్య ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ చర్చ.. యువతలో జీవిత విలువలు, ఆశలు, సమాజం ఎదురుచూస్తున్న బాధ్యతల మధ్య బ్యాలెన్స్‌పై పెద్ద చర్చకు దారి తీసింది.
