డిసెంబర్‌లో దూసుకెళ్లిన యూపీఐ.. ఒకే నెలలో రూ. 28 లక్షల కోట్ల డిజిటల్ పేమెంట్స్ రికార్డ్

డిసెంబర్‌లో దూసుకెళ్లిన యూపీఐ.. ఒకే నెలలో రూ. 28 లక్షల కోట్ల డిజిటల్ పేమెంట్స్ రికార్డ్

డిజిటల్ చెల్లింపుల విప్లవంలో భారత్ మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. 2025 ఏడాదిని యూపీఐ పేమెంట్స్ వ్యవస్థ ఘనంగా ముగించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించిన తాజా వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య ఆల్-టైమ్ హై రికార్డును నమోదు చేసింది.

డిసెంబర్ 2025లో మొత్తంగా 2వేల163 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. అంతకుముందు నవంబర్‌తో పోలిస్తే ఇది 5.7% పెరుగుదల. లావాదేవీల విలువ పరంగా చూస్తే.. ఇది రూ.28 లక్షల కోట్లకు చేరువయ్యింది. అలాగే నవంబరులో నమోదైన దాని కంటే ఇది 6.3% ఎక్కువ కావటం గమనార్హం. అక్టోబర్‌లో నమోదైన 2వేల070 కోట్ల లావాదేవీల రికార్డును ఇది అధిగమించింది. అలాగే అక్టోబరు మాసంలో జరిగిన ట్రాన్సాక్షన్ల మెుత్తం విలువ రూ. 27.3 లక్షల కోట్లను దాటేసింది.

వార్షిక ప్రాతిపదికన చూస్తే.. 2024 డిసెంబర్‌తో పోలిస్తే లావాదేవీల సంఖ్య 29%, అలాగే లావాదేవీల విలువ 20% మేర పెరగడం విశేషం. అంటే సగటున భారతీయులు రోజుకు సుమారు 69.8 కోట్ల పేమెంట్లను యూపీఐ ద్వారానే చేస్తున్నారని లెక్కల ప్రకారం తెలుస్తోంది.

యూపీఐ లావాదేవీల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా, యావరేజ్ లావాదేవీ విలువ మాత్రం క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. 2023లో రూ.16 వందలుగా ఉన్న సగటు ట్రాన్సాక్షన్ విలువ.. ఇప్పుడు రూ.వెయ్యి293కు పడిపోయింది. దీనిని బట్టి చాయ్ బంక్ నుంచి కూరగాయల మార్కెట్ వరకు ప్రతి చిన్న అవసరానికి ప్రజలు డిజిటల్ పేమెంట్లను అలవాటు చేసుకున్నారని నిపుణులు చెబుతున్నారు. కానీ పెద్ద చెల్లింపుల కోసం మాత్రం యూపీఐ వాడటం లేదని భౌతిక కరెన్సీ పైనే ఆధారపడుతున్నారని ఇటీవలి స్టడీ వెల్లడించింది.

ఒకపక్క యూపీఐ పేమెంట్స్ దేశంలో దూసుకుపోతుండగా.. మరోపక్క టోల్ చెల్లింపుల వ్యవస్థ 'ఫాస్టాగ్' మాత్రం సంతృప్తికర స్థాయికి చేరుకున్నట్లు డేటా చెబుతోంది. డిసెంబర్‌లో హాలిడే ట్రావెల్ వల్ల లావాదేవీలు 4.1% పెరిగి 38.4 కోట్లకు చేరినప్పటికీ.. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే వృద్ధి దాదాపు నిలకడగా ఉంది. మొత్తానికి నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. 2026లో భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి.