
ముంబై: మార్చి నెలలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్(యూపీఐ) ద్వారా మునుపెన్నడూ లేని విధంగా 870 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఈ ట్రాన్సాక్షన్ల విలువ రూ. 14 లక్షల కోట్లు. లావాదేవీల సంఖ్య, లావాదేవీల విలువ ...రెండింటిలోనూ మార్చి నెలలో కొత్త రికార్డులు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది మార్చితో పోలిస్తే సంఖ్యా పరంగా యూపీఐ లావాదేవీలు 60 శాతం, విలువ పరంగా 46 శాతం ఎక్కువైనట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) డేటా వెల్లడిస్తోంది.
కిందటేడాది మార్చిలో రూ. 9.60 లక్షల కోట్ల విలువైన 540 కోట్ల లావాదేవీలు యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగాయి. జనవరి 2023 లో మొదటిసారిగా యూపీఐ 800 కోట్ల ట్రాన్సాక్షన్లను ప్రాసెస్ చేసింది. కానీ, ఫిబ్రవరిలో ఇవి కొంత తగ్గాయి. 2016 లో మొదలైన యూపీఐ ప్లాట్‌ఫామ్‌కు 100 కోట్ల లావాదేవీల మార్కు అందుకోవడానికి మూడేళ్లు పట్టింది. డిజిటల్ పేమెంట్స్‌కు మారు పేరుగా యూపీఐ ప్లాట్‌ఫామ్ మారింది. పర్సన్ టూ పర్సన్, పర్సన్టూ మర్చంట్ (పీ2ఎం) ట్రాన్సాక్షన్లు ఎక్కువగా యూపీఐ ప్లాట్‌ఫామ్‌ద్వారా జరుగుతున్నాయి. మొత్తం డిజిటల్ పేమెంట్స్‌లో యూపీఐ ప్లాట్‌ఫామ్‌కు 75 శాతం వాటా ఉంది.