కేసీఆర్​కు సెంటు భూమి లేదు.. సొంత కారు లేదు .. ఎన్నికల అఫిడవిట్‌‌లో పేర్కొన్న కేసీఆర్​

కేసీఆర్​కు సెంటు భూమి లేదు.. సొంత కారు లేదు .. ఎన్నికల అఫిడవిట్‌‌లో పేర్కొన్న కేసీఆర్​
  • గంగుల, ఆయన భార్యకు 12.5 కేజీల బంగారం
  • మంత్రి మల్లారెడ్డి చేతిలో రూపాయి కూడా లేదు
  • పొంగులేటి ఆస్తులు రూ.434 కోట్లు
  • తనకు స్థిరాస్తులేమీ లేవని బండి సంజయ్ అఫిడవిట్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలతో అఫిడవిట్లను సమర్పించారు. ఆ అఫిడవిట్లను ఈసీ వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌లోడ్ చేశారు. వీటిలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తన పేరుపై సెంటు భూమి కూడా లేదని, వాహనాలు కూడా ఏమీ లేవని అఫిడవిట్‌‌లో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తన చేతిలో రూపాయి కూడా లేదని మంత్రి మల్లారెడ్డి చూపారు. ఇప్పటివరకు అఫిడవిట్లు సమర్పించిన వారిలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు తేలింది. భువనగిరి నుంచి పోటీ చేస్తున్న పైళ్ల శేఖర్ రెడ్డికీ రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి.

కేసీఆర్ దంపతుల ఆస్తులు రూ.58.93 కోట్లు

రాష్ట్రానికి రెండుసార్లు సీఎంగా పని చేసిన కేసీఆర్‌‌‌‌కు సొంత కారు లేదని ఎన్నికల అఫిడవిట్‌‌లో తెలిపారు. తన పేరిట వాహనాలు కూడా లేనట్లు వెల్లడించారు. ఈసీ వెబ్‌‌సైట్‌‌లో అప్​లోడ్ చేసిన అఫిడవిట్ ప్రకారం గురువారం నాటికి కేసీఆర్ చేతిలో రూ.2,96,605 క్యాష్ మాత్రమే ఉంది. బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్‌‌డ్, టెర్మ్ డిపాజిట్లు వంటివి రూ.11.16 కోట్లు ఉన్నట్లు చూపించారు. ఆయన భార్య కల్వకుంట్ల శోభకు బ్యాంకుల్లో రూ.6.29 కోట్లు ఉంది.

ఇక తెలంగాణ బ్రాడ్‌‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో రూ. 2.31 కోట్లు, తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లో రూ.4.16 కోట్ల విలువైన వాటాలు ఉన్నాయి. మొత్తం రూ. 17.40 లక్షలు విలువ చేసే బంగారం, వజ్రాలు, రత్నాలు కేసీఆర్ దగ్గర ఉన్నాయి. ఆయన భార్య శోభ పేరిట 2,841 గ్రాముల (2.8 కేజీల) బంగారు ఆభరణాలున్నాయి. 45 కేజీల వెండి వస్తువులున్నాయి. వీటి విలువ రూ.1.49 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా కేసీఆర్ పేరిట చరాస్తులు రూ.17.83 కోట్లు, ఆయన భార్య పేరిట రూ.7.78 కోట్లు, కేసీఆర్ కుటుంబానికి రూ.9.81 కోట్ల మేర చరాస్తులున్నాయి. కేసీఆర్ పేరిట రూ. 8.5 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య పేరిట ఏమీ లేవు.

మొత్తంగా కేసీఆర్ దంపతులకు స్థిర, చరాస్తులు రూ.58.93 కోట్లు. మొత్తం అప్పులు రూ.24.51 కోట్లుగా పేర్కొన్నారు. 2018 ఎన్నికల సమయంలో బ్యాంకుల్లో ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్లు, సేవింగ్స్‌‌ కలిపి రూ.5.63 కోట్లు ఉండగా.. ఇప్పుడది 11.16 కోట్లకు పెరిగింది. కేసీఆర్‌‌ సతీమణి శోభ చేతిలో 2018 ఎన్నికల సమయంలో రూ.94 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.6.29 కోట్లకు చేరింది. తన పేరు మీద సెంటు భూమి కూడా లేదని అఫిడవిట్‌‌లో కేసీఆర్ ప్రస్తావించడం కొసమెరుపు. ఉన్న భూమంతా కుటుంబ ఉమ్మడి ఆస్తిగా చూపించారు. కేసీఆర్ కుటుంబానికి 62 ఎకరాల భూమి ఉండగా.. అందులో 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి.

పొంగులేటికి రూ.434 కోట్ల ఆస్తులు

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రూ.434 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో పొంగులేటి పేరిట రూ.32 కోట్లు, ఆయన భార్య పేరిట 364 కోట్ల చరాస్తులున్నాయి. అందులో తన్లా ప్లాట్‌‌ఫామ్స్ లిమిటెడ్ సంస్థలో షేర్ల విలువ రూ. 236 కోట్లు కాగా, రాఘవ కనస్ట్రక్షన్స్‌‌లో రూ.47 కోట్లకు పైగా విలువైన షేర్లు ఉన్నాయి. ఆయనకు రూ.2.85 లక్షల విలువైన 50 గ్రాముల బంగారం ఉండగా.. భార్యకు రూ.2.43 కోట్ల విలువైన మూడున్నర కేజీల బంగారం, వజ్రాలు ఉన్నాయి. ఇక పొంగులేటికి మొత్తం రూ.43.53 కోట్ల అప్పులున్నాయి.

సంజయ్‌‌పై 35 కేసులు

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఎంపీ బండి సంజయ్‌‌కు రూ.42.33 లక్షలు, ఆయన భార్య అపర్ణకు రూ.37.18 లక్షలు ఉన్నాయి. తనకు స్థిరాస్తులేమీ లేవని సంజయ్ పేర్కొన్నారు. ఫార్చూనర్, మారుతి సియాజ్, ఇన్నోవా కార్లు.. హీరోహోండా స్ప్లెండర్, యాక్టివా బైకులున్నాయి. సంజయ్ పేరిట బంగారం ఏమీ లేదు. భార్యకు రూ.24 లక్షల విలువైన 43 తులాల బంగారం, రూ.3 లక్షల విలువైన వెండి ఉన్నాయి. సంజయ్ అప్పులు రూ.5.44 లక్షలు, ఆయన భార్య అప్పులు రూ.12.4 లక్షలుగా చూపించారు. తనపై మొత్తం 35 కేసులు పెండింగ్‌‌లో ఉన్నట్లు బండి సంజయ్ తన అఫిడవిట్‌‌లో వెల్లడించారు.

గోల్డ్ మ్యాన్ గంగుల

  • మంత్రి గంగుల కమలాకర్​కు మొత్తం రూ.35 కోట్ల ఆస్తులు, రూ.50 లక్షల అప్పులు ఉన్నాయి. గంగుల, ఆయన భార్యకు 12.5 కేజీల బంగారం ఉన్నది. ఇందులో ఆయన పేరు మీద 4.5 కేజీలు, భార్య పేరిట 8 కేజీల బంగారం ఉంది.
  •  భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి అఫిడవిట్లో తన ఆస్తులు రూ.227 కోట్లుగా చూపించారు. అయితే తన పేరిట బంగారమేమీ లేదని పేర్కొన్నారు. 
  •  జనగామ బీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌‌రెడ్డికి 30.25 ఎకరాలు, ఆయన భార్యకు 10.13 ఎకరాల సాగు భూమి ఉందని తెలిపారు. తన పేరిట, తన భార్య పేర మొత్తం రూ.21.46 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్​లో పేర్కొన్నారు.
  •  విద్యాసంస్థల అధినేతగా పేరున్న మంత్రి మల్లారెడ్డి చేతిలో క్యాష్​ ఒక్క రూపాయి కూడా లేదని అఫిడవిట్‌‌లో పేర్కొన్నారు. ఆయనకు, ఆయన భార్యకు వాహనాలు కూడా లేవు. ఇద్దరికీ కలిపి మొత్తం ఆస్తి రూ. 95.94 కోట్లు ఉండగా.. రూ.7.39 కోట్ల అప్పులున్నాయి. మల్లారెడ్డిపై ఒక పెండింగ్ కేసు ఉంది.
  •  నల్గొండ కాంగ్రెస్‌‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి తనకు, తన భార్యకు కలిపి రూ.11.54 కోట్ల ఆస్తులు ఉన్నాయని, అప్పులు రూ.6.44 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
  •  మంత్రి పువ్వాడ అజయ్‌‌కుమార్‌‌ తనకు, తన భార్యకు రూ.51.40 కోట్ల ఆస్తులున్నట్లు చూపారు. ఆయన చేతిలో రూ.2.95 లక్షలు, సతీమణి చేతిలో రూ.1.90 లక్షల నగదు ఉన్నట్టుగా చూపించారు.
  •  మంత్రి హరీశ్ రావు తనకు రూ. 24 కోట్ల ఆస్తులు, రూ.11 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన వద్ద ఒక 32 ఎన్పీ బోర్ పిస్టల్ ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనపై నమోదైన 2 కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయి.

రేవంత్‌‌ ఆస్తులు రూ.30.95 కోట్లు

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్‌‌లో తనకు సెకండ్ హ్యాండ్ కారు ఉన్నట్లు వెల్లడించారు. ఆయన వద్ద రెండు వాహనాలు ఉండగా.. అందులో ఒకటి హోండా సిటీ, రెండోది బెంజ్. బెంజ్ సెకండ్ హ్యాండ్ కారని పేర్కొన్నారు. 89 పెండింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు. నామినేషన్ వేసే నాటికి ఆయన వద్ద రూ.5.34 లక్షల నగదు ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి, ఆయన భార్యకు కలిపి ఉన్న ఆస్తులు రూ.30.95 కోట్లుగా పేర్కొన్నారు.

ఇద్దరికీ కలిపి మొత్తం రూ.1.30 కోట్ల మేర అప్పులున్నట్లు అఫిడవిట్లో చూపించారు. రేవంత్ రెడ్డి దగ్గర రూ.2 లక్షల విలువ చేసే పిస్టల్, రూ. 50 వేల విలువ చేసే రైఫిల్ ఉన్నాయి. రేవంత్ భార్య వద్ద 1,235 గ్రాముల బంగారం, వజ్రాల నగలున్నాయి. వాటి విలువ రూ.83.36 లక్షలుగా పేర్కొన్నారు.  దీంతో పాటు ఆమె వద్ద రూ.7.17 లక్షల విలువైన 9,700 గ్రాముల వెండి ఉంది.