ఉప్పల్ లో ఫోన్ కొట్టేసి.. గొంతు కోసుకుండు

ఉప్పల్ లో  ఫోన్ కొట్టేసి.. గొంతు కోసుకుండు

ఉప్పల్​, వెలుగు: దొంగతనం చేస్తూ దొరికిపోయిన ఓ పాత నేరస్తుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉప్పల్ పద్మావతి కాలనీకి చెందిన పోతగంటి శ్రీనివాస్ సోమవారం తెల్లవారుజామున చల్లగాలి కోసం ఇంటి తలుపులు తెరిచి నిద్రపోయాడు. ఇదే అదనుగా ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడి మొబైల్ ఫోన్​ను ఎత్తుకెళ్లారు. గమనించిన బాధితుడు వెంటనే అప్రమత్తమై వారిని వెంబడించాడు. దుండగులు స్కూటీపై పారిపోవడానికి ప్రయత్నించగా, వారు వెళ్తున్న దారి డెడ్ ఎండ్ కావడంతో స్కూటీ ఆగిపోయింది.

ఆ సమయంలో ఒక నిందితుడు ఫోన్​తో పరార్ అవ్వగా, స్కూటీతో సహా రెండో వ్యక్తి పట్టుబడ్డాడు. పోలీసులు సమాచారం ఇచ్చేలోపే.. సదరు నిందితుడు తన వద్ద ఉన్న బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులు వెంటనే అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పట్టుబడ్డ వ్యక్తిని వికారాబాద్ మైలార్​దేవ్‌‌పల్లికి చెందిన పాత నేరస్తుడు కొమ్మని శ్రీనివాస్​గా పోలీసులు గుర్తించారు. తప్పించుకున్న రెండో నిందితుడి కోసం గాలిస్తున్నారు.