
గండిపేట, వెలుగు: స్కూటీ ఇంజిన్‌లో గంజాయిని దాచి.. అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని ఉప్పర్ పల్లి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ అప్పా జంక్షన్ వద్ద శంషాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పీఎస్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ టైంలో ఒడిశాకు చెందిన హరిశంకర్ గోల్దర్ (30) స్కూటీపై అప్పా జంక్షన్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తుండగా అనుమానం వచ్చి వెహికల్‌ను చెక్‌చేశారు.
దీంతో స్కూటీలో 7 కిలోల గంజాయి లభ్యమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. లంగర్‌హౌజ్‌కు చెందిన ఎస్.మహేశ్‌కుమార్(23), హైదర్షాకోట్‌కు చెందిన వరుణ్‌కుమార్(19)కు కూడా విక్రయించినట్లు తెలిపాడు. దీంతో అప్పా జంక్షన్ వద్ద కాపు కాసి బైక్‌లపై వస్తున్న ఆ ఇద్దరిని కూడా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హరిశంకర్ ఒడిశా నుంచి గంజాయిని తెచ్చి మహేశ్, వరుణ్ కు కిలో రూ.3 వేలకు అమ్ముతుండగా.. మహేశ్, వరుణ్ కిలో రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. అలాగే, వీరు సన్‌సీటీ, లంగర్‌హౌజ్, గంధంగూడ తదితర ప్రాంతాల్లో స్టూడెంట్లు, లేబర్‌కు విక్రయిస్తున్నట్టు విచారణలో తెలిపారు. వీరు గతంలోనూ గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారని ఎక్సైజ్ పోలీసులు వివరించారు.