
మెదక్ (మనోహరాబాద్), వెలుగు: కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్‌లను సర్కారు వృథాగా పెడుతోంది. పనులు కంప్లీటై దాదాపు 10 నెలలు గడుస్తున్నా ఓపెన్ చేయడం లేదు. నేషనల్ హైవేపై వెళ్లే ప్రయాణీకులు, స్థానికంగా ఉండే ప్రజలు సేద తీరేందుకు వీలుగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని మనోహరా బాద్, పరికిబండ, చేగుంట మండలం వడ్యారంలో రూ.4.50 కోట్లతో ఫారెస్ట్ అర్బన్ పార్క్‌లు డెవలప్ చేశారు. వ్యూ పాయింట్ లు, వాకింగ్ ట్రాక్ లు, ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ, వీటిని అందుబాటులోకి తీసుకురాకపోవడంతో అలంకార ప్రాయంగా మారాయి.
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో
నేషనల్ హైవేల వెంట ఫారెస్ట్ ఏరియాలో అర్బన్ పార్క్‌లు డెవలప్‌చేసి వాటిని వీకెండ్ టూరిస్ట్స్పాట్లుగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్ణయించింది. ఇందులో భాగంగా నాలుగేళ్ల కింద మెదక్ జిల్లాలో నేషనల్ హైవే 44 సమీపంలో మూడు అర్బన్ పార్క్‌లకు ప్రతిపాదనలు రెడీ చేసి రూ. 4.50 కోట్లు మంజూరు చేసింది. 2019లో రూ. 2 కోట్లతో మండల కేంద్రమైన మనోహరాబాద్‌లో 880 హెక్టార్లలో, రూ. 1.16 కోట్లతో ఇదే మండలంలోని పరికిబండలో 129 హెక్టార్లలో, రూ.1.14 కోట్లతో చేగుంట మండలం వడ్యారంలో 465 హెక్టార్లలో పార్క్ డెవలప్‌మెంట్ పనులు మొదలు పెట్టింది. రెండేళ్లలో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకు వస్తామని అప్పట్లో సంబంధిత అధికారులు ప్రకటించారు.
పనులు పూర్తయినా..
ఈ మూడు పార్క్‌ల పనులు 10 నెలల కిందనే పూర్తయ్యాయి. వడ్యారం అర్బన్ పార్క్ చుట్టూరా 11 కిలో మీటర్ల పొడవునా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఎంట్రెన్స్ దగ్గర అట్రాక్టివ్ గా నేచురల్ లుక్‌తో కమాన్, లోపల మెడిటేషన్ చేసుకునేందుకు వీలుగా ధ్యాన మందిరం నిర్మించారు. అడవి అందాలు తిలకించేందుకు వాచ్‌టవర్ ఏర్పాటు చేశారు. మనోహరాబాద్ అర్బన్ పార్క్ఎంట్రెన్స్ దగ్గర అట్రాక్టివ్‌గా కమాన్ ఏర్పాటుతో పాటు లోపల ధ్యాన మందిరం, యోగా కేంద్రం, వాచ్‌టవర్ , కూర్చునేందుకు కుర్చీలు పెట్టారు. పరికి బండ అర్బన్ పార్క్ ఎంట్రెన్స్ దగ్గర కమాన్ లోపల యోగా మందిరం, చిల్ట్రన్ ప్లే ఏరియా ఏర్పాటు చేయడంతో పాటు వివిధ రకాల మొక్కలు నాటారు. కానీ నేటికీ ఓపెన్ చేయకపోవడంతో స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కోట్లు పెట్టి అక్కెరకు రాకుంటే ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు.
అందుబాటులోకి తేవాలి
మండలంలో ఏర్పాటు చేసిన మనోహరాబాద్, పరికిబండ అర్బన్ పార్క్ లను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. పనులు పూర్తి అయి చాలా రోజులు అవుతున్నా కూడా అధికారులు ఎందుకు ఓపెన్ చేయడం లేదో అర్థం అయితలేదు. - బండారి నవీన్, మనోహరాబాద్
హెచ్ఎండీఏ హ్యాండోవర్ చేయలేదు
అర్బన్ పార్క్‌లను హెచ్ఎండీ ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వాళ్లు ఇంకా మాకు హ్యాండోవర్ చేయలేదు. వాళ్లు అప్పగించగానే పైఅధికారుల ఆదేశాల మేరకు ఓపెనింగ్ కు ఏర్పాట్లు చేస్తం. - మోహన్, ఎఫ్ఆర్వో, తూప్రాన్ రేంజ్