
ముంబై: తన ప్రాణాలకు ముప్పుందని, రక్షణ కల్పించాలంటూ సినీ నటి, కాం గ్రెస్ ఎంపీ అభ్యర్థి ఊర్మిళ మటోండ్కర్ సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ముంబై నార్త్ లోక్‌సభ బరిలో ఉన్న ఊర్మిళ ఎన్ని కల ప్రచారంలో భాగంగా సోమవారం బోరివలిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. ‘బోరివలిలో ప్రచారం చేస్తుండగా 15 నుంచి 20 మంది అక్కడికి వచ్చి మోడీ, మోడీ అంటూ నినాదాలు చేశారు. డ్యాన్సులు చేస్తూ మాపార్టీ మహిళా కార్యకర్తలతో అభ్యంతరకర చర్యలకు పాల్పడ్డారు . తర్వాత నా వాహనం వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మా కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది’ అని చెప్పారు .