వాషింగ్టన్: తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్‌ను ఆదుకునేందుకు అమెరికా ప్రభుత్వం 31 మిలియన్ డాలర్ల (రూ.296 కోట్లకు పైగా) ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత వంతెనల నిర్మాణం, బాధితుల సంక్షేమం, భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనేందుకు డ్రోన్ల పంపిణీ నిమిత్తం ఈ నిధులను కేటాయించనున్నట్లు వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్‌లో నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్‌తో అమెరికా రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ అల్లిసన్ హుకర్ సమావేశమయ్యారు.
ఈ భేటీలోనే ఆమె ఈ సహాయాన్ని అధికారికంగా ప్రకటించారు. వరదల్లో దెబ్బతిన్న రవాణా వ్యవస్థను పునరుద్ధరించడానికి రూ.95.72 కోట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, ఆశ్రయాలు, జీవనోపాధి, శీతాకాలపు రక్షణ సామగ్రి కోసం రూ.75.56 కోట్లు కేటాయించగా, భవిష్యత్తులో విపత్తు సహాయక చర్యలను వేగవంతం చేయడానికి రూ.124.41 విలువైన అమెరికాలో తయారైన అత్యాధునిక డ్రోన్లను సరఫరా చేయనున్నారు.
తాజా ప్రకటతో నేపాల్ వరద సాయం కోసం అమెరికా అందించిన మొత్తం 36 మిలియన్ డాలర్ల ( రూ.344.51 కోట్ల)కు చేరుకుంది. అవసరమైన చోట మరింత సాయం అందించేందుకు నేపాల్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
