క‌రోనాపై పోరులో భార‌త్ కు అగ్ర‌రాజ్యం ఆర్థిక‌ సాయం.. రూ.22 కోట్లు

క‌రోనాపై పోరులో భార‌త్ కు అగ్ర‌రాజ్యం ఆర్థిక‌ సాయం.. రూ.22 కోట్లు

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరులో భార‌త్ కు అండ‌గా నిలుస్తామ‌ని అమెరికా ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా 2.9 మిలియ‌న్ డాల‌ర్ల (భార‌త క‌రెన్సీలో 22 కోట్ల రూపాయ‌లు) ఆర్థిక సాయం అనౌన్స్ చేసింది. దీనిని యూఎస్ ఏజెన్సీ ఫ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ డెవ‌ల‌ప్మెంట్ (యూఎస్ఎయిడ్) ద్వారా అందించ‌నున్న‌ట్లు తెలిపింది. భార‌త్ లో అమెరికా రాయ‌బారి కెన్నెత్ జ‌స్ట‌ర్ మాట్లాడుతూ క‌రోనాపై పోరాటంలో త‌మ సాయం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు.ఈ మ‌హ‌మ్మారిని కంట్రోల్ చేసేందుకు అమెరికా, భార‌త ప్ర‌భుత్వాలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటూ ప‌ని చేస్తున్నాయ‌న్నారు. భార‌త్ లోని మెడిక‌ల్ రీసెర్చ్ సంస్థ‌ల‌తో అమెరికాలోని సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ సంస్థ క‌లిసి ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపారు. గ‌డిచిన 20 ఏళ్ల‌లో భార‌త్ కు అమెరికా 300 కోట్ల డాల‌ర్ల ఆర్థిక సాయం చేసింద‌ని, అందులో 140 కోట్ల డాల‌ర్లు వైద్య స‌దుపాయాల కోస‌మే చేసిన‌ట్లు చెప్పారు.

64 దేశాల‌కు రూ.1314 కోట్లు

క‌రోనా గ్లోబ‌ల్ హెల్త్ ఎమ‌ర్జెన్సీగా ప‌రిణ‌మించిన నేప‌థ్యంలో అన్ని దేశాల ప్ర‌భుత్వాలు, అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం ద్వారా ఈ మ‌హ‌మ్మారిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని అమెరికా రాయ‌బార కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌నలో తెలిపింది.ప్ర‌పంచ వ్యాప్తంగా 64 దేశాల‌కు క‌లిపి 174 మిలియ‌న్ డాల‌ర్ల (రూ.1314 కోట్లు) ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించిన‌ట్లు వెల్ల‌డించింది. అఫ్ఘానిస్థాన్ కు రూ.37.7 కోట్లు (5 మిలియ‌న్ డాల‌ర్లు), బంగ్లాదేశ్ కు రూ.25.6 కోట్లు (3.4 మిలియ‌న్ డాల‌ర్లు), భార‌త్ కు రూ.22 కోట్లు (2.9 మిలియ‌న్ డాల‌ర్లు), శ్రీలంక‌కు రూ.9.8 కోట్లు (1.3 మిలియ‌న్ డాల‌ర్లు), నేపాల్ కు రూ.13.5 కోట్లు (1.8 మిలియ‌న్ డాల‌ర్లు) అంద‌జేస్తున్న‌ట్లు తెలిపింది.

ఆస్ప‌త్రులు, మందులు చాల‌క అమెరికా ఇబ్బందులు

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని వ‌ణికిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 12 ల‌క్ష‌ల 85 వేల మందికి వైర‌స్ సోకగా.. 70 వేల మందికి పైగా మ‌ర‌ణించారు. దాదాపు 2 ల‌క్ష‌ల 70 వేల మందికిపైగా పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌పంచ దేశాల్లో అమెరికాలో అత్య‌ధికంగా 3 ల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా వైర‌స్ సోకింది. అందులో 9 వేల మంది మ‌ర‌ణించారు. ఆ దేశంలో క‌రోనా కేసులు భారీగా పెర‌గ‌డంతో పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ఆస్ప‌త్రులు స‌రిపోని ప‌రిస్థితి నెల‌కొంది. ఓపెన్ ఏరియాలు, పార్కుల్లో టెంట్లు వేసి తాత్కాలిక ఆస్ప‌త్రులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. మ‌రోవైపు మందులు కూడా అవ‌స‌ర‌మైన మేర అందుబాటులో లేక అమెరికా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భార‌త్ నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ అమెరికాకు ఎగుమ‌తి చేయాల్సిందిగా ప్ర‌ధాని మోడీని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కోరారు.

ఇట‌లీలో ల‌క్షా 28 వేల మంది వైర‌స్ బారిన‌ప‌డ‌గా.. 15,887 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్ లో ల‌క్షా 35 వేల మందికి క‌రోనా సోక‌గా.. 13 వేల మంది మ‌ర‌ణించారు. చైనాలో 81,708 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా.. అందులో 3,331 మంది మృతి చెందారు. భార‌త్ లో నాలుగు వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు కాగా.. అందులో 109 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.