మళ్లీ రగిలిన పశ్చిమాసియా: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ డ్రోన్లను పేల్చేసిన అమెరికా

మళ్లీ రగిలిన పశ్చిమాసియా: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ డ్రోన్లను పేల్చేసిన అమెరికా

టెహ్రాన్: డ్రోన్లు, మిస్సైల్స్, బాంబుల మోతతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఓ వైపు శాంతి ఒప్పందంపై చర్చలు జరుపుతూనే.. మరోవైపు అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో విరుచుకుపడ్డాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేయగా.. అమెరికా దళాలు వాటిని విజయవంతంగా అడ్డుకుని పేల్చేశాయి. ఈ దాడులకు ప్రతీకారంగా హార్మూ్జ్ జలసంధి సమీపంలోని గోరుక్, ఖేష్మ్ ద్వీపంలోని ఇరాన్ రాడార్ స్థావరాలపై అమెరికా మెరుపు దాడులు చేసింది. ఈ పరస్పర దాడులతో హార్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 

ఈ దాడులను అమెరికా ధృవీకరించింది. ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్‌లకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం ప్రతీకార దాడులు నిర్వహించిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తెలిపింది. ఇరాన్ డ్రోన్‌ దాడి ప్రాంతీయ సముద్ర రవాణాకు తక్షణ ముప్పును కలిగించాయని పేర్కొంది. ఇరాన్ తదుపరి దాడుల నుంచి రక్షించుకోవడానికి అమెరికా దళాలు గోరుక్, ఖేష్మ్ ద్వీపంలోని ఇరాన్ రాడార్ స్థావరాలపై దాడి చేశాయని తెలిపింది.

మిడిల్ ఈస్ట్‎లో అమెరికా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని.. ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్ అన్యాయమైన దురాక్రమణకు ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఓ వైపు శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అమెరికా- ఇరాన్ ఒకరిపై పరస్పర దాడులు చేసుకోవడంతో మిడిల్ ఈస్ట్‎లో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి.